
హైదరాబాద్‌లో ఐకియా తొలిస్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీడన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఫర్నిచర్ రిటైల్ సంస్థ ఇండియాలో తొలి రిటైల్ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. సుమారుగా రూ. 500 నుంచి రూ. 600 కోట్ల పెట్టుబడితో ఈ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయనుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లోకి 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత వస్తున్న తొలి అంతర్జాతీయ కంపెనీ ఐకియానే. దేశంలో సుమారుగా రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఐకిమా ముందుకొచ్చింది.
ఇందులో భాగంగా తొలి ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఐకియా ఇండియా సీఈవో జువెన్సియో మాజ్తూ సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ తొలి రిటైల్ ఔట్‌లెట్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. మొన్నటి సింగపూర్ పర్యటనలో ఐకియా స్టోర్ నన్ను ఆకర్షించింందన్నారు. తెలంగాణ కళాకారులు తయారు చేసే నిర్మల్ బొమ్మలు, పెయింట్స్, పెంబర్తి బొమ్మలు, సిల్వర్ ఫిల్గిరి వంటి వాటికి ఈ ఔట్‌లెట్‌లో చోటు కల్పించాల్సిందిగా ఐకియా ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రిని కలిసిన సామ్‌సంగ్ ప్రతినిధులు
అన్ని చెల్లింపులకు ఒకే కార్డును వినియోగించుకునే క్లియరింగ్ హౌసింగ్ సిస్టమ్స్ (సీసీహెచ్‌ఎస్) ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి సామ్‌సంగ్ డేటా సిస్టమ్ ప్రతినిధులు వివరించారు. బస్, రైల్వే, మెట్రో రైల్, టాక్సీలు, రిటైల్ షాపులన్నింటిలో వినియోగించుకునే విధంగా కాంటాక్ట్‌లెస్ కార్డ్‌తో ఈ సీసీహెచ్‌ఎస్ సిస్టమ్ పనిచేస్తుందని, ఇప్పటికే ఈ విధానం బ్రిటన్, హాంకాంగ్, జపాన్ దేశాల్లో వాడుకలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో రావాల్సిందిగా కోరారు.