వ్యాపార వృద్ధిపై సీఈవోల ధీమా
ముంబై: ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి, వేగంగా మారిపోతున్న టెక్నాలజీ తదితర సవాళ్లతో కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ.. సంస్థల సీఈవోలు మాత్రం వ్యాపార వృద్ధి అవకాశాలపై ధీమాగానే ఉన్నారు. దేశీయంగా 71 శాతం మంది సీఈవోలు రాబోయే పన్నెండు నెలల్లో తమ సంస్థల వృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇది 38 శాతంగాను, చైనాలో 35 శాతం, బ్రెజిల్‌లో 57 శాతంగాను ఉంది.
కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నిర్వహించిన 20వ సీఈవో సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల్లో 1,379 మంది.. భారత్‌లో 106 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు. పెరుగుతున్న ఆదాయ స్థాయిలు, పట్టణీకరణ తదితర పటిష్టమైన వృద్ధి మూలాలు.. భారత సీఈవోల్లో ఆశావహ ధోరణికి కారణమని సర్వే నివేదిక పేర్కొంది. రాబోయే రోజుల్లో అమలు చేయబోయే సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పెరుగుదల తదితర అంశాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని వివరించింది.
సుశిక్షితులైన సిబ్బంది, ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి, టెక్నాలజీ మార్పుల్లో వేగం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు తగు స్థాయిలో లేకపోవడం, అధిక నియంత్రణ మొదలైనవి కంపెనీలకు ప్రధాన సవాళ్లుగా ఉంటున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ శ్యామల్ ముఖర్జీ తెలిపారు. సర్వే ప్రకారం భారత సీఈవోలు .. అమెరికా, చైనా, బ్రిటన్ వంటి పెద్ద విదేశీ మార్కెట్లలో అవకాశాలు దక్కించుకోవడంపై దృష్టి పెడుతున్నారు.