ఇన్ఫీ బైబ్యాక్‌ రెడీ..! | Infosys board to consider first-ever share buyback on 19 August | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ బైబ్యాక్‌ రెడీ..!

Published Fri, Aug 18 2017 12:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM

ఇన్ఫీ బైబ్యాక్‌ రెడీ..!

ఇన్ఫీ బైబ్యాక్‌ రెడీ..!

19న బోర్డు సమావేశంలో నిర్ణయం...
రూ.13,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం
కంపెనీ చరిత్రలో తొలి బైబ్యాక్‌...
భారీగా ఉన్న నగదు నిల్వలను వాటాదారులకు పంచడమే లక్ష్యం
తాజా ప్రకటనతో 5 శాతం దూసుకెళ్లిన షేరు


బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌.. షేర్ల బైబ్యాక్‌కు రంగం సిద్ధమైంది. వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేసే(బైబ్యాక్‌) ప్రతిపాదనపై ఈ నెల 19న(శనివారం)బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.  ఎంతమొత్తంలో బైబ్యాక్‌ ఉంటుందనేది ఇన్ఫీ వెల్లడించనప్పటికీ.. సుమారు రూ.13,000 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి.

 కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను వాటాదారులకు పంచాలంటూ కొంతమంది ప్రమోటర్లు, ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్‌లు చాన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ లేదా షేర్ల బైబ్యాక్‌ లేదా రెండింటి రూపంలో వాటాదారులకు దాదాపు రూ.13,000 కోట్లను చెల్లించనున్నట్లు ఇన్ఫోసిస్‌ ఏప్రిల్‌లోనే ప్రకటించింది. కాగా, 36 ఏళ్ల ఇన్ఫోసిస్‌ చరిత్రలో ఇదే తొలి షేర్ల బైబ్యాక్‌ కానుండటం గమనార్హం.

ఇతర దిగ్గజాల బాటలోనే...
దేశీ సాఫ్ట్‌వేర్‌ అగ్రగామి టీసీఎస్‌ మొదలు... విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్, కాగ్నిజెంట్, మైండ్‌ట్రీ ఇతరత్రా పలు ఐటీ కంపెనీలు ఇటీవల వరుసపెట్టి షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీసీఎస్‌ రూ.16,000 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయగా... కాగ్నిజెట్‌ 3.4 బిలియన్‌ డాలర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. ఈ వరుస బైబ్యాక్‌ల ఒత్తిడితో ఇన్ఫోసిస్‌ కూడా ఎట్టకేలకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ ఏడాది జూన్‌ చివరినాటికి ఇన్ఫోసిస్‌ వద్ద 6 బిలియన్‌ డాలర్లకు పైగా (సుమారు రూ.39,000 కోట్లు) నగదు నిల్వలు ఉన్నాయి.

జూన్‌లో జరిగిన  సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లోనే రూ.13,000 కోట్ల నగదు నిల్వల కేటాయింపు ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా, బైబ్యాక్‌కు తమ బోర్డు ఆమోదం తెలిపితే... అమెరికాలో కూడా   ఏడీఆర్‌ ల బైబ్యాక్‌ కోసం యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఇన్ఫోసిస్‌ పేర్కొంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే  బైబ్యాక్‌ చేపట్టేందుకు వీలవుతుందని తెలిపింది.

వెంటాడుతున్న అనిశ్చితి...: మార్కెట్‌ పరిస్థితులు సరిగ్గాలేనప్పుడు షేరు ధరకు పునరుత్తేజం కల్పించడం కోసం, అదేవిధంగా మిగులు నగదును వాటాదారులకు పంచడం కోసం కంపెనీలు ఈ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటిస్తూ ఉంటాయి. మార్కెట్‌లో ప్రస్తుత ధరతో పోలిస్తే భారీగానే ప్రీమియం రేటును ఆఫర్‌ చేస్తుంటాయి. వాటాదారుల నుంచి షేర్లను వెనక్కి తీసుకోవడంతో షేర్ల సంఖ్య తగ్గి ఒక్కో షేరుపై రాబడి(ఈపీఎస్‌) మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది.

అమెరికా సహా పలు దేశాలు ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీకి డిమాండ్‌ మందగిండచంతో దేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. లాభాలను నిలబెట్టుకోవడం కోసం ఉద్యోగాల కోతలకు కూడా వెనుకాడటం లేదు. ఈ మందగమన పరిస్థితులు కూడా ఐటీ సంస్థల వరుస బైబ్యాక్‌లకు ఒక కారణంగా పరిశీలకులు పేర్కొంటున్నారు.

షేరు రయ్‌...
బైబ్యాక్‌ ప్రకటన వెలువడటంతో ఇన్ఫోసిస్‌ షేరు దూసుకుపోయింది. గురువారం బీఎస్‌ఈలో దాదాపు 5 శాతంపైగానే ఎగబాకి రూ.1,026ను తాకింది. చివరకు 4.5 శాతం లాభంతో రూ.1,021 వద్ద ముగిసింది. ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10,190 కోట్లు దూసు కెళ్లి రూ.2,34,555 కోట్లకు
చేరింది.  

ప్రమోటర్ల ఒత్తిడితో...
ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి సహా కొందరు ప్రమోటర్లు కొంతకాలంగా ఇన్ఫోసిస్‌ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా కంపెనీ సీఈఓ విశాల్‌ సిక్కాతో పాటు ఇతరత్రా కొందరు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల వేతన ప్యాకేజీలను భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని ప్రమోటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. కంపెనీలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సరిగ్గా లేదంటూ ఆరోపణలు కూడా గుప్పించారు. మరోపక్క, మోహన్‌దాస్‌ పాయ్‌ వంటి ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా యాజమాన్య నిర్ణయాలపై నిరసన గళం వినిపిస్తున్నారు.

 భారీగా ఉన్న నగదు నిల్వలను ఇష్టానుసారం ఖర్చుచేయకుండా వాటాదారులకు పంచాలని, బైబ్యాక్‌ను ఆఫర్‌ చేయాలనేది వారి దీర్ఘకాల డిమాండ్‌. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌ ప్రక్రియకు తెరతీసింది. 2014లో తాను ఇన్ఫీ చైర్మన్‌ పదవినుంచి వైదొలగడం పట్ల ఇప్పుడు చింతిస్తున్నానని.. కొనసాగాలంటూ తన సహచరులు(కో–ఫౌండర్స్‌) ఇచ్చిన సూచనలను వినిఉండాల్సిందంటూ మూర్తి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీలో మళ్లీ ఏదైనా బాధ్యతలను చేపట్టాలని నారాయణమూర్తి భావిస్తే.. పరిశీలించేందుకు తాము సిద్ధమేనంటూ ఇటీవల ఇన్ఫీ సహ–చైర్మన్‌ రవి వెంకటేశన్‌ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement