ఐఎస్‌బీలో ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్ ల్యాబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్న, వర్ధమాన దేశాల్లో ఇన్వెస్టింగ్ తీరుతెన్నుల గురించి అవగాహన పెంచే దిశగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)తో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) చేతులు కలిపింది. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ క్యాంపస్‌లో ట్రేడింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఎండీ చిత్రా రామకృష్ణ బుధవారం ఇక్కడ దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా మారుతున్న ట్రేడింగ్ తీరుతెన్నులు, సంపన్న దేశాల్లో పాటిస్తున్న విధానాలు, వర్ధమాన దేశాల్లో విధానాలు మొదలైన వాటిని అధ్యయనం చేసేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడగలదని ఈ సందర్భంగా చిత్రా తెలిపారు.
బిజినెస్ స్కూల్స్‌తో ఎన్‌ఎస్‌ఈ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే ప్రథమం అని ఆమె చెప్పారు. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా విద్యార్థులు ఎప్పటికప్పుడు ప్రపంచ మార్కెట్ల పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ల్యాబ్‌లో 34 ట్రేడింగ్ టెర్మినల్స్ ఉన్నాయని ఐఎస్‌బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. బ్లూమ్‌బర్గ్, థామ్సన్ రాయిటర్స్ వంటి ప్రీమియం బిజినెస్ సంస్థల డేటాబేస్‌లు కూడా వారికి అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకునేందుకు ఈ ల్యాబ్ తోడ్పడగలదని రంగ్నేకర్ వివరించారు.