బ్యాంకుల చేతికి ఐవీఆర్‌సీఎల్?
42 శాతానికి చేరిన వాటా;
మెజారిటీ దిశగా అడుగులు
► 8.75 శాతానికి తగ్గిన ప్రమోటర్ల వాటా
► కంపెనీ బోర్డులో బ్యాంకుల నుంచి
ఇద్దరు పరిశీలకులు
► కన్సార్షియంగా ఏర్పడిన 6 బ్యాంకులు
►నవంబర్‌లోగా రూ. 2,000 కోట్ల ఆస్తుల విక్రయానికి సన్నాహాలు
► కంపెనీ తమ చేతిలోనే
ఉంటుందంటున్న యాజమాన్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌లో మెజారిటీ వాటాను దక్కించుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయా? తీసుకున్న రుణాలను తీర్చలేక ఇప్పటికే వడ్డీని ఈక్విటీగా మార్చుకుంటున్న బ్యాంకులు ఇప్పుడు కంపెనీలో 51 శాతం వాటాను తీసుకుని, యాజమాన్య హక్కులు చేజిక్కించుకోవాలనుకుంటున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవన్నీ నిజమేననిపించక మానదు. ఎందుకంటే ఐవీఆర్‌సీఎల్‌కి అప్పులిచ్చిన ఆరు బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి కంపెనీలో యాజమాన్య హక్కు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తీసుకున్న రుణాలను పునర్‌వ్యవస్థీకరించినా, సీడీఆర్ ప్యాకేజీ కింద వడ్డీని ఈక్విటీగా మార్చుకున్నా కంపెనీ పనితీరు మెరుగుపడలేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బ్యాంకులు యాజమాన్య హక్కులను తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం ఎస్‌బీఐ నేతృత్వంలో ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐవోబీ, కెనరా, ఆంధ్రా బ్యాంక్‌లు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. జూన్ 30 నాటికి ఈ ఆరు బ్యాంకులకూ కలిపి మొత్తంగా 26.81 శాతం వాటా ఉంది. ఈ వాటాకు గాను కంపెనీ బోర్డులో బ్యాంకుల తరఫున ఇప్పటికే ఇద్దరు పరిశీలకులు కూడా ఉన్నారు.
భయం లేదు: కంపెనీ వర్గాలు
ఆర్‌బీఐ కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్‌డీఆర్) విధానం కింద రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ రుణాన్ని ఈక్విటీగా మార్చుకోవచ్చు. కనీసం 51% వాటాకు తక్కువ కాకుండా తీసుకుని, కంపెనీలో పూర్తి యాజమాన్య హక్కులను సొంతం చేసుకోవచ్చు. అయితే దీనికి అప్పులిచ్చిన సంస్థల్లో 75%గానీ లేకపోతే ఇచ్చిన అప్పు విలువలో 60% ఇచ్చినవారి నుంచి గానీ మద్దతు పొందాల్సి ఉంది. ఐవీఆర్‌సీఎల్ విషయంలో ఈ రెండు నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి బ్యాంకులు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీకి ఉన్న ప్రధానమైన రూ.4,900 కోట్ల అప్పులో మెజార్టీ వాటాను ఈక్విటీగా మార్చుకొని బ్యాంకు ఖాతాల నుంచి ఎన్‌పీఏ మరకను తొలగించుకోవాలని బ్యాంకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను కంపెనీ తోసిపుచ్చుతోంది. ఒకవేళ మెజారిటీ వాటాను బ్యాంకులు తీసుకున్నా కంపెనీని తామే నిర్వహిస్తామన్న ధీమాను కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు.
ఇప్పుడిప్పుడే కంపెనీ గాడిలో పడుతోందని, వచ్చే 18 నెలల్లో కంపెనీ టర్న్ అరౌండ్ అవుతుందని చెప్పారాయన. ‘‘కొన్నాళ్లుగా ఆస్తుల్ని విక్రయించి అప్పులు తీరుద్దామని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఆ ప్రయత్నాలకు సాంకేతికంగా అడ్డంకులు ఎదురయ్యాయి. నవంబర్‌లోగా ఆస్తుల విక్రయం ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరిస్తాం. దీనివల్ల రూ. 1,500 కోట్ల రుణ భారం తగ్గడమే కాకుండా, రూ.500 కోట్ల ఈక్విటీ సమకూరుతుందని అంచనా వేస్తున్నాం’’ అని చెప్పారాయన. ప్రస్తుతం ఎస్‌బీఐ బేస్ రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గిం చటం వల్ల వడ్డీ భారం నెలకు రూ.2 కోట్లు తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.
మార్కెట్ విలువ 380 కోట్లకు!
మొత్తం ఐవీఆర్‌సీఎల్ గ్రూపునకు సుమారుగా రూ. 7,000 కోట్ల రుణాలు ఉంటే అందులో ప్రధానమైన కన్‌స్ట్రక్షన్ కంపెనీకి రూ.4,900 కోట్ల వరకు అప్పులున్నాయి. ఈ అప్పుల్లో 75 శాతం వాటా ఈ ఆరు బ్యాంకులదే. ఈ అప్పులకు కంపెనీ వడ్డీలు చెల్లించలేకపోవటంతో కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ కింద కట్టాల్సిన వడ్డీని ఈ బ్యాంకులు ఈక్విటీగా మార్చుకున్నాయి. 2013 నవంబర్ నుంచి కట్టాల్సిన రూ.600 కోట్ల మేర వడ్డీని... షేరు ధర దాదాపు రూ.24 దగ్గర ఉన్నపుడు బ్యాంకులు ఈక్విటీగా మార్చుకున్నాయి. అయితే షేరు ధర వేగంగా పతనమవుతూ ప్రస్తుతం రూ.7.45కు చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా హరించుకుపోయి 380 కోట్లకు పడిపోవటంతో బ్యాంకుల్లో ఆందోళన మొదలయినట్లు సమాచారం. మరోవంక బ్యాంకులకు వడ్డీ కోసం కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో ప్రమోటర్ల వాటా 13.7 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గింది. ఈ మిగిలిన వాటాలో కూడా చాలావరకూ ప్రమోటర్లు బ్యాంకుల వద్ద తనఖా పెట్టారు. ఈ ఆరు బ్యాంకులతో కలిపి ఇతర ఆర్థిక సంస్థల చేతిలో 44.53 శాతం వాటా ఉంది.