
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాట్సాప్ ద్వారా బ్యాంక్ సేవలను వినియోగించుకునే రోజులు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా కొటక్ మహీంద్రా బ్యాంక్ తొలి అడుగులు వేసేసింది. దేశంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా సేవలను ప్రారంభించినట్లు కొటక్ ప్రకటించింది. కొటక్ వాట్సాప్ నంబరు +91 22 6600 6022 ద్వారా కొటక్ బ్యాంక్ కస్టమర్లు నేరుగా చాట్ చేయవచ్చు.
పాన్, ఆధార్, ఈ–మెయిల్, మొబైల్ నంబర్లు అప్‌డేట్, పాస్‌బుక్ యాక్టివేషన్/డియాక్టివేషన్, ఎఫ్‌ఏటీసీఏ డిక్లరేషన్, ఎన్‌ఏసీహెచ్ రద్దు, హోమ్ బ్రాంచ్ మార్పు వంటి సేవలను వాట్సాప్ ద్వారా వినియోగించుకునే వీలుంటుందని కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ దీపక్ శర్మ తెలిపారు. త్వరలోనే కొటక్ 811 కస్టమర్లకు బ్యాంక్ వాట్సాప్ నంబరు, డిజిటల్ కిట్స్‌లను అందిస్తామని పేర్కొన్నారు.
వాట్సాప్ బ్యాంకింగ్ సేవలతో కస్టమర్లుకు మరింత వేగవంతమైన, నాణ్యమైన, పారదర్శకమైన సేవలను అందించే వీలు కలుగుతుందన్నారు. డేటా భద్రత విషయంలోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కస్టమర్లు కావాలంటే ఏ సమయంలోనైనా వాట్సాప్ నుంచి వైదొలిగే వీలు కూడా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొటక్‌కు 1,368 బ్రాంచీలు, 2,199 ఏటీఎంలున్నాయి.