
ఏమన్నా... డైమండ్ అంటే ఆ కథే వేరు. వజ్రాల మీద మక్కువ మనకి మామూలుగా ఉండదు. వజ్రపుటుంగరం, డైమండ్ నెక్లెస్... ఇవన్నీ భారతీయుల కల. మరి వజ్రాభరణం కొనాలంటే..? బంగారంతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టాలి. దీంతో ఇది అందరికీ సాధ్యపడక పోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో డబ్బులుండాలి కదా? ఉన్నా ఖర్చుపెట్టగలగాలి కదా? మరేం చేద్దాం..!! ఈ ప్రశ్నకు జవాబుందా? లేకేం! సంపద కూడబెట్టడానికి ఏకైక మార్గం సిప్ అని అంతా చెబుతుంటారు కదా! మరి వజ్రాలు కొనుక్కోవటానికి కూడా సిప్ చేయొచ్చు కదా!! నెలవారీ క్రమానుగతంగా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ (సిప్) వజ్రాలను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడొచ్చింది. సెబీ అనుమతితో ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఐసీఈఎక్స్) దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకే సిప్ అవకాశం ఉండగా, ఐసీఈఎక్స్ దీన్ని వజ్రాల విషయంలోనూ సాకారం చేసింది.
– సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
ఇతర లోహాలతో పోలిస్తే...
ఇతర లోహాలతో పోల్చి చూస్తే వజ్రాలు చాలా ఖరీదైనవి. అమూల్యమైన లోహాల కేటగిరీలోకి వస్తాయి. బంగారం, ప్లాటినం, వెండి కంటే ఖరీదైనవి. సాధారణంగా ఉన్నత వర్గాల వారు వజ్రాభరణాలను ఎక్కువగా ధరిస్తుంటారు. అందుకే బంగారంతో పోల్చుకుంటే వజ్రాలకు లిక్విడిటీ (కావాలనుకున్నపుడు వెంటనే నగదుగా మార్చుకోవడం) తక్కువ.
వజ్రాలను సిప్ చేయటమెలా..?
మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ఎంత సులభమో ఇందులోనూ సరిగ్గా అంతే. ఐసీఈఎక్స్‌లో ఖాతాను ప్రారంభించి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వజ్రాలను సొంతం చేసుకోవచ్చు. ప్రపంచంలో వజ్రాలు ట్రేడయ్యే తొలి ఎక్స్ఛేంజ్ కూడా ఐసీఈఎక్స్ కావడం గమనార్హం. సెబీ నుంచి ఇటీవలే ఈ ఎక్స్ఛేంజ్ అనుమతి పొందింది. వినియోగదారులు వజ్రాలను సిప్ విధానంలో దక్కించుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపొందించింది.
ఖాతా తప్పనిసరి
వజ్రాల కోసం ఐసీఈఎక్స్ బ్రోకర్ వద్ద ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. కేవైసీ ధ్రువీకరణల తర్వాత కొంత మేర డిపాజిట్ చెల్లించడం ద్వారా ఖాతాను తెరవచ్చు. ప్రతి నెలా ఏ తేదీన వజ్రాలు కొనాలనుకుంటున్నామో ముందుగానే బ్రోకర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. షేర్ల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల మాదిరిగానే ఈ ఖాతాను కూడా ప్రారంభించాలి. అందుకు అవసరమైన ధ్రువపత్రాలు... ఆధార్ కార్డు, పాన్ కార్డు, చిరునామా ధ్రువీకరణ వంటివి ఇవ్వాల్సి వస్తుంది.
ఎంత కాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్
వజ్రాన్ని బట్టి సిప్ ఉంటుంది. ఉదాహరణకు 30 సెంట్ల డైమండ్ కావాలనుకుంటే దాని ధర (ఐసీఈఎక్స్ ప్రకారం) రూ.27,000. ఇందుకోసం ప్రతి నెలా కనీసం రూ.900తో సిప్ మొదలు పెట్టొచ్చు. ఇలా 30 నెలల పాటు ఇన్వెస్ట్ చేస్తే రూ.27,000 అవుతాయి. దీంతో 30 సెంట్ల వజ్రాన్ని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఏదైనా అవాంతరం ఏర్పడి కాల వ్యవధి మధ్యలోనే సిప్ ఆపేసినా నష్టం లేదు.
అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన మేర వజ్రం డీమ్యాట్ ఖాతాలో జమ అయి ఉంటుంది. మళ్లీ వీలైనప్పుడు సిప్ మొదలు పెట్టి 30 వాయిదాలు పూర్తి చేసిన తర్వాత వజ్రాన్ని అందుకోవచ్చు. అంటే వజ్రాన్ని డెలివరీ తీసుకోవాలంటే కనీసం 30 సెంట్ల సైజును సమకూర్చుకోవాలి. సిప్ రూపంలోనే కాదు!!. డబ్బులు సిద్ధంగా ఉంటే ఒకేసారి చెల్లించి ఐసీఈఎక్స్ నుంచి కొనుగోలు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. వజ్రం వద్దనుకుంటే తిరిగి ఐసీఈఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఎప్పుడైనా దాన్ని అమ్మేసుకోవచ్చు. ఐసీఈఎక్స్ మూడు రకాల సైజుల్లో వజ్రాల ట్రేడింగ్‌ను ప్రారంభిస్తోంది. 30 సెంట్లు, 50 సెంట్లు, 100 సెంట్లు. 100 సెంట్లు అంటే ఒక క్యారట్‌తో సమానం.
ఒక షేరు మాది రిగా ఒక సెంట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. స్టాక్‌మార్కెట్లో షేర్ల మాదిరి గా ఐసీఈఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై వజ్రాలు ఎలక్ట్రానిక్ రూపంలో ట్రేడవుతుంటా యి. కొన్నప్పుడు షేర్ల వలే వజ్రాలు కూడా ఎలక్ట్రానిక్ రూపంలోనే డీమ్యాట్ ఖాతాకు వెళతాయి. విక్రయించినప్పుడు డెబిట్ అవుతాయి. ఒకవేళ మీరు డెలివరీ తీసుకోవాలనుకుంటే వజ్రం రూపంలోనే మీ చేతికి అందుతుంది.
వజ్రాల్లో సిప్ చేస్తే రాబడి ఉంటుందా?
ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఐసీఈఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై వజ్రాలు అప్పటి కరెంట్ మార్కెట్ ధరల మేరకు ట్రేడవుతూ ఉంటాయి. కొంత కాలానికి వజ్రాల ధరలు పెరగొచ్చు. లేదా తగ్గొచ్చు. కనుక వజ్రాలపై కొంత కాలానికి రాబడి అందుకోవాలన్న ఉద్దేశంతో సిప్ ఎంచుకోవడం సరికాకపోవచ్చు.
పెట్టుబడిగా చూడకుండా ఆభరణాల కోసం వజ్రాలను సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం... అంతర్జాతీయంగా పేరొందిన డీబీర్స్ సంస్థ నుంచి నాణ్యతా ధ్రువీకరణతో పాటు సులభంగా వజ్రాన్ని సొంతం చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది.ఇంకెందుకు ఆలస్యం!! వజ్రాభరణాలు ధరించాలనే కల మీకుంటే... దాన్ని నెరవేర్చుకోవటానికి ఇప్పుడే సిప్ మొదలుపెట్టండి. నెలకు కనీసం రూ.1100 చొప్పున ఇన్వెస్ట్ చేసినా... దాదాపు రెండేళ్లలో వజ్రాలు మీ చేతికొస్తాయి!!
Comments
Please login to add a commentAdd a comment