రిలయన్స్ లాభం భేష్!
క్యూ4లో రూ.6,381 కోట్లు; 8.5 శాతం జూమ్
⇒ రికార్డు రిఫైనింగ్ మార్జిన్ల తోడ్పాటు; జీఆర్‌ఎం 10.1 డాలర్లు
⇒ టర్నోవర్ రూ.70,863 కోట్లు; 33 శాతం డౌన్
⇒ షేరుకి రూ.10 చొప్పున డివిడెండ్
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఆకర్షణీయమైన ఫలితాలతో ఆకట్టుకుంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ రూ.6,381 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది.
అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,881 కోట్లతో పోలిస్తే 8.5 శాతం పెరిగింది. పెట్రోకెమికల్, చమురు-గ్యాస్ వ్యాపారం మందగించినప్పటికీ... రికార్డు స్థాయి రిఫైనింగ్ మార్జిన్లు లాభాల జోరుకు తోడ్పడ్డాయి. కాగా, గడచిన ఏడేళ్లకుపైగా కాలంలో ఈ కంపెనీ ఒక క్వార్టర్‌లో ఇంత భారీస్థాయి లాభాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. క్యూ4లో రిలయన్స్ కన్సాలిడేటెడ్ టర్నోవర్ రూ.70,863 కోట్లుగా నమోదైంది.
అంతక్రితం సంవత్సరం క్యూ4లో టర్నోవర్ రూ.1.06 లక్షల కోట్లతో పోలిస్తే 33.3 శాతం దిగజారింది. క్రూడ్ ధరల తగ్గుదల, ఎగుమతుల్లో క్షీణత ఆదాయాలపై ప్రభావం చూపిం ది. డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో నికర లాభం రూ. 5,256 కోట్లతో పోలిస్తే.. మార్చి(క్యూ4) క్వార్టర్ లాభం త్రైమాసింగా (సీక్వెన్షియల్) 21.4% ఎగసింది. దేశ కార్పొరేట్ రంగ లాభాల చరిత్రలో ఇదే అతిపెద్ద సీక్వెన్షియల్ వృద్ధి అని పరిశీలకులు పేర్కొంటున్నారు.
స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే...
రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇతరత్రా ప్రధాన వ్యాపారాల(స్టాండెలోన్)కు సంబంధించి రిలయన్స్ క్యూ4 నికర లాభం 10.9 శాతం ఎగబాకి రూ.6,243 కోట్లుగా నమోదైంది. 2007-08 క్యూ3లో రూ.8,079 కోట్ల లాభం తర్వాత మళ్లీ ఇదే అత్యధిక లాభమని కంపెనీ తెలిపింది.
పూర్తి ఏడాదికి ఇలా...
2014-15 పూర్తి ఏడాదికి ఆర్‌ఐఎల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.23,566 కోట్లకు పెరిగింది. 2013-14లో లాభం రూ.22,493 కోట్లతో పోలిస్తే 4.8% వృద్ధి చెందింది. ఇక టర్నోవర్ 13 శాతం క్షీణించి రూ.3.88 లక్షల కోట్లకు దిగజారింది. 2013-14లో టర్నోవర్ రూ.4.46 లక్షల కోట్లుగా నమోదైంది.
‘ముడి చమురు ధరల భారీ పతనం, హైడ్రోకార్బన్స్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి ఉన్నప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరాన్ని విజయవంతంగా ముగించాం. ఇది మాకు చాలా కీలకమైన ఏడాదిగా కూడా నిలిచింది. రిఫైనింగ్ వ్యాపారంలో రికార్డు రాబడులు నమోదయ్యాయి. అధునాతన డిజిటల్ సర్వీసులు, హైడ్రోకార్బన్స్ వ్యాపారంలో భారీస్థాయి పెట్టుబడుల ద్వారా వృద్ధి జోరును కొనసాగిస్తాం. ఇక మా రిటైల్ వ్యాపారం అత్యంత వేగంగా పురోగమిస్తోంది’.
- ముకేశ్ అంబానీ, ఆర్‌ఐఎల్ సీఎండీ
రికార్డు జీఆర్‌ఎం
మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌లో రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం- ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించిన రాబడి) రికార్డు స్థాయిలో 10.1 డాలర్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో జీఆర్‌ఎం 9.3 డాలర్లుగా ఉంది. ఇక 2014-15, డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో ఇది 7.3 డాలర్లే. ఇక 2015-16 పూర్తి ఏడాదికి జీఆర్‌ఎం 8.6 డాలర్లుగా నమోదైంది.
ఫలితాల్లో ఇతర ప్రధానాంశాలు...
⇒ రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకి కంపెనీ రూ.10 చొప్పున(100 శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది.
⇒ 2014-15 క్యూ4లో పెట్రోకెమికల్స్ వ్యాపార ఆదాయం రూ. 26,541 కోట్ల నుంచి రూ.21,754 కోట్లకు తగ్గింది. రిఫైనింగ్ టర్నోవర్ రూ.96,668 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఈ టర్నోవర్ రూ.56,442 కోట్లు.
⇒ చమురు-గ్యాస్ ఉత్పత్తి విభాగం ఆదాయం రూ.2,798 కోట్ల నుంచి రూ.2,513 కోట్లకు క్షీణించింది. ఇక ఈ విభాగం పన్ను ముందు లాభం ఏకంగా 36 శాతం పడిపోయి రూ.489 కోట్లకు పరిమితమైంది.
⇒ కేజీ-డీ6లో గ్యాస్-క్రూడ్ ఉత్పత్తి క్షీణత, తక్కువ గ్యాస్ ధరలు కూడా ఈ విభాగంలో ఆదాయాన్ని దెబ్బతీశాయని ఆర్‌ఐఎల్ పేర్కొంది. క్యూ4లో ఇక్కడ 0.6 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు, 36.5 బిలియన్ ఘనపుటడుగుల సహజవాయువును మాత్రమే ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. క్యూ3తో పోలిస్తే... క్రూడ్ ఉత్పత్తి 3 శాతం, గ్యాస్ ఉత్పత్తి 5% తగ్గినట్లు వెల్లడించింది.
⇒ తాజాగా ముగిసిన స్పెక్ట్రం వేలంలో ఆర్‌ఐఎల్ టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 13 కీలక సర్కిళ్లలో స్పెక్ట్రంను దక్కించుకుంది. ఇందులో 800, 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రం ఉంది. దీంతో తమకు ఇప్పుడు మొత్తం 22 సర్కిళ్లలో స్పెక్ట్రం ఉన్నట్లయిందని కంపెనీ తెలిపింది. కాగా, 2,300 మెగాహెర్ట్జ్ బ్యాండ్(4జీ)లో దేశవ్యాప్తం స్పెక్ట్రం ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ప్రారంభానికి విస్తృతంగా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
⇒ మార్చి చివరినాటికి ఆర్‌ఐఎల్ మొత్తం రుణ భారం రూ.1.6 లక్షల కోట్లకు ఎగసింది. 2014 డిసెంబర్‌నాటికి ఈ మొత్తం రూ.1.5 లక్షల కోట్లు. కాగా, కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు మాత్రం రూ.78,691 కోట్ల నుంచి రూ.84,472 కోట్లకు పెరిగాయి.
⇒ శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర స్వల్ప నష్టంతో రూ.927 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.
రిటైల్ జూమ్...
ఆర్‌ఐఎల్ రిటైల్ వ్యాపార విభాగం మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ఈ వ్యాపార ఆదాయం క్యూ4లో రూ.3,653 కోట్ల నుంచి రూ.4,788 కోట్లకు ఎగబాకింది. ఏకంగా 31 శాతం దూసుకెళ్లింది. ఇక పన్ను ముందు లాభం క్యూ4లో రూ.24 కోట్ల నుంచి రూ.104 కోట్లకు ఎగసింది. 333 శాతం వృద్ధిని సాధించింది. ఇక 2014-15 పూర్తి ఏడాదికి ఈ విభాగం ఆదాయం రూ.14,556 కోట్ల నుంచి రూ.17,640 కోట్లకు(21 శాతం అప్) ఎగబాకింది.
పన్ను ముందు లాభం రూ.118 కోట్ల నుంచి రూ.417 కోట్లకు పెరిగింది. అంటే 250 శాతం పైగా దూసుకెళ్లినట్లు లెక్క. గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ కొత్తగా 930 స్టోర్లను ప్రారంభించింది. దీంతో మార్చి నాటికి కంపెనీ మొత్తం రిటైల్ స్టోర్ల సంఖ్య మొత్తం 200 నగరాల్లో 2,621కి చేరింది.