
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ క్షేత్రాల వేలంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ, కెయిర్న్ ఇండియా సంస్థలు అత్యధిక క్షేత్రాలకు బిడ్లు వేశాయి. ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్) కింద తొలిసారిగా నిర్వహించిన వేలంలో ఓఎన్‌జీసీ 41 క్షేత్రాలకు, వేదాంత గ్రూప్‌లో భాగమైన కెయిర్న్ ఇండియా 15 క్షేత్రాలకు బిడ్లు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగానికి చెందిన మరో సంస్థ ఆయిల్ ఇండియా, ప్రైవేట్ సంస్థ హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కూడా ఈ వేలంలో పాల్గొన్నాయి. తొలివిడత బిడ్డింగ్‌కి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు సమర్పించడానికి బుధవారం ఆఖరు రోజు.
చివరి రోజు నాటికి 57 బిడ్లు రాగా.. జూలైలోనే అత్యధికంగా 45 బిడ్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్‌లో ఒకటి, అక్టోబర్‌లో ఏడు వచ్చాయి. దేశవిదేశాలకు చెందిన పలు దిగ్గజ సంస్థలు ఈ వేలంలో పాల్గొనలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ బీపీ కూడా దూరంగా ఉన్నాయి. దిగుమతులపై ఆధార పడకుండా దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్రం ఓఏఎల్ విధానాన్ని రూపొందించింది. గతంలో ప్రభుత్వమే నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసి, వేలం నిర్వహించేది. అయితే, కొత్త విధానంలో ప్రస్తుతం ఉత్పత్తి జరగని ఏ ప్రాంతాన్నైనా కంపెనీలు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది.