పతంజలి సిమ్ కార్డులు లాంచ్ చేస్తున్న రాందేవ్ బాబా
హరిద్వార్ : టెలికాం మార్కెట్‌లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియోకు గట్టి పోటీ వచ్చేసింది. దేశంలో అత్యంత నమ్మకమైన కన్జ్యూమర్ గూడ్స్ బ్రాండ్‌గా పేరులోకి వచ్చిన రాందేవ్ బాబా పతంజలి బ్రాండు ఆదివారం టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను రాందేవ్ బాబా లాంచ్ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ భాగస్వామ్యంలో ఈ సిమ్ కార్డులను ప్రవేశపెట్టారు. తొలుత ఈ సిమ్ కార్డు ప్రయోజనాలను పతంజలి ఉద్యోగులకు, ఆఫీసు బేరర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాందేవ్ బాబా చెప్పారు.
రిలయన్స్ జియో కూడా తొలుత తన జియో సిమ్ కార్డును లాంచ్ చేసినప్పుడు, ఉద్యోగులకే మొదట దాని ప్రయోజనాలను అందజేసింది. అనంతరం కమర్షియల్‌గా మార్కెట్‌లోకి లాంచ్ అయి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పతంజలి లాంచ్ చేసిన ఈ సేవలు పూర్తిగా మార్కెట్‌లోకి వచ్చిన అనంతరం, ఈ కార్డులతో పతంజలి ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. కేవలం 144 రీఛార్జ్‌తో దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకునే సౌకర్యం, 2జీబీ డేటా ప్యాక్, 100 ఎస్‌ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్ చేయనుంది.వాటితో పాటు ప్రజలకు ఈ సిమ్ కార్డులపై వైద్య, ప్రమాద, జీవిత బీమాలను పతంజలి అందించనుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ ‘స్వదేశీ నెట్‌వర్క్’ అని ఈ సందర్భంగా రాందేవ్ అన్నారు. పతంజలి, బీఎస్‌ఎన్‌ఎల్ ఇరు కంపెనీల ఉద్దేశ్యం కూడా దేశ సంక్షేమమేనని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కున్న ఐదు లక్షల కౌంటర్లలో, పతంజలి స్వదేశీ సమృద్ధి కార్డులు ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పతంజలితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంపై బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునిల్ గార్గ్ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment