ఇబ్బందిలేని మదుపును కోరుకుంటున్నారా..
• సేవింగ్స్ అకౌంట్స్ నుంచి ఎన్‌పీఎస్ వరకూ ఎన్నో మార్గాలు
• అవసరార్థం డబ్బుకు ఢోకాలేదు
• ఆందోళన అక్కర్లేదు
భారతీయులు గొప్ప మదుపరులు. 2014లో ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం– మన స్థూల దేశీయ పొదుపు రేటు 31.1 శాతం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారత్ ప్రజలు మదుపునకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మెజారిటీ ప్రజలు తమ డబ్బు భద్రతకు తొలి ప్రాముఖ్యత ఇస్తారు. ఎప్పుడు అవసరపడితే అప్పుడు డబ్బు చేతికి అందాలనీ కోరుకుంటారు. ఇది స్టాక్స్, కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ వంటి సాధనాల్లో సా ధ్యపడదు. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా... ఇక్కడా మార్కెట్ ఒడిదుడుకులు పొంచి ఉంటాయి. ఎలాంటి ఒడిదుడుకు లూ లేకుండా... పొదుపు చేసిన డబ్బుకు పూర్తి భరోసాను ఇస్తూ... ప్రణాళికలకు అనుగుణంగా డబ్బు చేతికి అందాలనుకునే చిన్న మదుపుదారులకు పలు ‘ఆర్థిక సాధనాల’ గురించి తెలియజేయడమే ఈ కథనం ముఖ్య ఉద్దేశం.
ముందుగా చేయాల్సింది...!
‘ఇబ్బంది లేని మదుపు’ దిశలో చిన్న మదుపుదారుగా మీరు తొలుత ప్రధానంగా మూడు సూత్రాలపై దృష్టి పెట్టాలి. వీటి ఆధారంగానే మీ ‘ఆర్థిక మదుపు ఇన్‌స్ట్రమెంట్’ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ వాటిని ఒక్కొక్కటిగా చూస్తే...
ఆర్థిక లక్ష్యాలు...
అసలు పొదుపునకు సంబంధించి మీ లక్ష్యాలు ఏమిటన్న అంశంపై తొలుత దృష్టి పెట్టాలి. రిటైర్‌మెంట్ ప్లానింగ్ లేదా ఇళ్లు కొనడం ఇదేమీ కాకుండా పిల్లల చదువులు. ఇంకా చెప్పాలంటే కారు కొనడం... సెలవులకు ఏదైనా పర్యటన చేయడం... ఇలా మీ స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. దీనిపైన ఒక స్పష్టతకు రావాలి.
సమయ నిర్ణయం...
ఆయా లక్ష్యాలకు అనుగుణంగా ఎంత సమయానికి మీ డబ్బు తిరిగి మీ చేతికి అందాలన్న అంశంపై అవగాహన ముఖ్యం.
పన్ను అంశాల పరిశీలన
ఇక మీ మదుపునకు సంబంధించి పన్ను అంశాలపైనా అవగాహన అవసరం. పన్ను భారాలు లేని ‘ఆర్థిక ఇన్‌స్ట్రమెంట్’ మీద దృష్టి ముఖ్యం. మీకు వచ్చే సంపదపై అధిక పన్ను పడే పరిస్థితుల్లో సంపద సృష్టి కష్టం. పన్నులు, ఈ అంశానికి సంబంధించి ప్రభావం దీర్ఘకాలం రిటర్న్స్‌పై ఎంతో ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఆర్థిక సాధనాలు ఇవీ...
సేవింగ్స్ అకౌంట్: ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండడం... కచ్చితంగా 4 నుంచి 6 శాతం వరకూ వడ్డీరేటు ఇక్కడ లభిస్తున్న ప్రధాన అవకాశం. వడ్డీ 10,000 లోపు అయితే పన్ను మినహాయింపూ ఉంటుంది. స్వల్ప కాలానికి అంటే 1 నుంచి 6 నెలలకు ఈ బ్యాంకింగ్ ప్రొడక్ట్ అత్యుత్తమ సాధనం.
స్థిర డిపాజిట్లు: మధ్య కాలానికి మంచిది. 9 నెలలు ఆపైన మదుపునకు ఇది మంచి సాధనం. 7 రోజుల నుంచి 7 సంవత్సరాలు (కొన్ని బ్యాంకులు ఆ పైన కూడా) నిర్దిష్ట వడ్డీరేట్లతో స్థిర డిపాజిట్లు మీ డబ్బుకు భరోసాను ఇస్తాయి. అయితే దీర్ఘకాలంలో చూస్తే ద్రవ్యోల్బణానికి విరుగుడు కాకపోవడం, పన్ను అంశాలు ఇక్కడ అవరోధాలు.
ఎఫ్‌ఎంపీలు: ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. క్లోజ్డ్ ఎండెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు. డెట్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రమెంట్లలోకి మీ నిధులు వెళతాయి. స్థిర డిపాజిట్ల పరిమాణంలోనే రిటర్న్స్ ఉంటాయి. మూడేళ్ల కాల వ్యవధికి పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. పన్ను భారాలు ఉండవు. అయితే ఏఏఏ రేటెడ్ ఎఫ్‌ఎంపీలను ఎంచుకోవాలి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పదిహేళ్లను ప్రత్యేకించి రిటైర్‌మెంట్ ప్రణాళికలకు సంబంధించి ఈ ప్రొడక్ట్ ఎంతో ప్రయోజనకరం. రిటర్న్స్‌పై అసలు పన్ను భారం ఉండదు. ఈ పథకానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహమూ ఉంది. ప్రభుత్వ నిర్ణయానుసారం త్రైమాసికానికి రిటర్న్స్ రేటు మారే వీలుంది. ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పరిమితి ఉంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్: ఇది కూడా ఒక చక్కటి రిటైర్‌మెంట్ ప్రణాళికే. భారత్ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. పొదుపును ప్రోత్సహిస్తూ... రిటైర్‌మెంట్‌పై యాన్యుటీ ప్రణాళికగా ఏకమొత్తం డబ్బు పొందడానికి ఈ పథకం వీలు కల్పిస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తరహాలో నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఎటువంటి పరిమితీ లేదు.
సిప్: మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక. ఈక్విటీల్లో క్రమానుగత పెట్టుబడులు ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇక్కడ రాబడి బాగుంటుందని ఫలితాలు చెబుతున్నాయి. పిల్లల ఉన్నత విద్య, రిటైర్‌మెంట్ ప్రణాళికలకు ఈ ప్రొడక్ట్ ఎంతో దోహదపడుతుంది. ఈక్విటీలపై అవగాహన లేని వారు సిప్ ద్వారా ఆ ప్రయోజనం పొందవచ్చు.