పెట్రోలు కార్లకే జనం మొగ్గు! | People tend to cars petrol! | Sakshi
Sakshi News home page

పెట్రోలు కార్లకే జనం మొగ్గు!

Published Sun, Jul 5 2015 11:36 PM | Last Updated on Fri, Sep 28 2018 3:18 PM

పెట్రోలు కార్లకే జనం మొగ్గు! - Sakshi

పెట్రోలు కార్లకే జనం మొగ్గు!

ఇంధన ధరల్లో తేడా తగ్గటంతో డీజిల్‌పై తగ్గిన ఆసక్తి
 
 సాక్షి, బిజినెస్ బ్యూరో : డీజిల్‌కు, పెట్రోల్‌కు మధ్య ధరల్లో తేడా వ్యత్యాసం తగ్గుతోంది. దీంతో డీజిల్ కారుకు ప్రీమియం ధర పెట్టి కొనటమెందుకులే అని భావిస్తున్నట్టున్నారు కొనుగోలుదారులు. ఫలితం... డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి!!.

 కారు కొనేటపుడు మొదట ఆలోచించేది ఏ బ్రాండ్ కొనాలా అని కాదు... డీజిల్ కారా... లేక పెట్రోల్ కారా అని. ఎందుకంటే ఇంధనమనేది ఆ కారు నడిపినన్నాళ్లూ అవసరమే. పెట్రోల్ ధరలకన్నా డీజిల్ ధరలు చాలా తక్కువ. రోజూ గనక ఎక్కువ కిలోమీటర్లు తిరిగే వాళ్లకు డీజిల్ వల్ల బాగా ఆదా అవుతుంది. అందుకని ప్రీమియం రేటు పెట్టి కొనాల్సి వచ్చినా... డీజిల్ కారు వైపే చాలామంది మొగ్గు చూపేవారు. కానీ ఇపుడా పరిస్థితి మారింది. డీజిల్‌కు, పెట్రోల్‌కు ధరల్లో తేడా తగ్గుతుండటంతో కొనుగోలు దారులు కూడా పెట్రోల్ కార్లకే మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ నెలనే తీసుకుంటే... మొత్తం కార్ల అమ్మకాల్లో డీజిల్ వాటా 34 శాతానికి పడిపోయింది. రీసేల్ మార్కెట్లో డీజిల్ కార్ల విలువ తగ్గుతుండటం, ట్రాలీల వంటి యుటిలిటీ వాహనాల విక్రయాలు తగ్గుతుండటం దీనికి మరో కారణంగా కనిపిస్తోంది.

 2012-13 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహనాల్లో 47 శాతంగా ఉన్న డీజిల్ వాహనాల అమ్మకాలు 2013-14కు వచ్చేసరికి 42 శాతానికి పడిపోయాయి. ఇక 2014-15లో ఈ వాటా  37 శాతానికి పరిమితమైంది. ఈ ట్రెండ్ పర్యావరణానికి మాత్రం మంచిదేనని ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ చెబుతోంది. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ కాలుష్యం కాస్త ఎక్కువ.

 ఇదీ... డీజిల్ కథ: ఇప్పటిదాకా నియంత్ర ణల్లో ఉంటూ వచ్చిన డీజిల్‌పై గతేడాది అక్టోబర్లో ప్రభుత్వం పూర్తిగా నియంత్రణలను ఎత్తివేసింది. అప్పట్నుంచి దాని ధరలు కూడా మార్కెట్‌ను అనుసరించి హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఒక్క మే నెల్లోనే డీజిల్ ధర ఏకంగా 11 శాతం పెరిగింది.  గతేడాది జనవరిలో పెట్రోల్-డీజిల్ ధరల మధ్య లీటరుకు రూ.18 వరకూ తేడా ఉండగా అక్టోబర్లో నియంత్రణలు తొలగించేనాటికి ఈ తేడా కేవలం రూ.11కు తగ్గింది. ప్రస్తుతం ఈ తేడా దాదాపు 16 రూపాయలుగా ఉన్నప్పటికీ ఈ ధరలు మార్కెట్ ప్రకారం కదులుతాయి కనక మున్ముందు మరీ ఎక్కువగా తేడా ఉండదన్నది బహిరంగమే.

‘‘డీజిల్ కార్లు కొనటానికి ప్రధాన కారణం ఇంధన ధరల్లో వ్యత్యాసమే. ఇపుడా వ్యత్యాసం బాగా తగ్గుతోంది కనక పెట్రోల్ కార్లు కొనటానికే ఇష్టపడుతున్నారు. పెట్రోల్ కార్లు డీజిల్ కన్నా చౌక కనక ఇపుడు వీటిని ఎంచుకోవటమే ఉత్తమం. పెపైచ్చు కాస్త ఫన్‌ని ఇష్టపడేవారు కూడా పెట్రోల్‌కే మొగ్గుతున్నారు’’ అని వోల్వో ఇండియా డిజిటల్ విభాగ డెరైక్టర్ సుదీప్ నారాయణ్ చెప్పారు. మున్ముందు ఎంట్రీలెవల్, లగ్జరీ, సెడాన్ సెగ్మెంట్లలో పెట్రోల్ వాహనాల వాటా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పదేళ్లకు మించిన డీజిల్ వాహనాలను నడపవద్దని ఆదేశించిన నేపథ్యంలో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వినియోగదారులు పెట్రోల్‌కే ఓటేస్తున్నారు. ‘‘ఈ ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాలేదు. కానీ దాని ప్రభావం మాత్రం అమ్మకాలపై కనిపిస్తోంది’’ అని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. డీజిల్ కార్ల వాటా 30-35 శాతం మధ్య స్థిరపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 కృత్రిమ ధరలు... కృత్రిమ డిమాండ్
 ఇదివరకు డీజిల్ ధరలు కృత్రిమంగా తక్కువగా ఉండేవని, అందుకే డీజిల్ వాహనాలకు కూడా కృత్రిమ డిమాండ్ ఉండేదని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. ‘‘మున్ముందు ఇంధన సామర్థ్యం, వాహన ధర బట్టే డీజిల్ కార్ల అమ్మకాలు ఆధారపడి ఉంటాయి’’ అన్నారాయన. పెట్రోలు వాడకంలో రెండంకెల వృద్ధి కనిపిస్తుండటంతో ఇది కూడా డీజిల్ వాహనాలు తగ్గుముఖం పడుతున్నాయనటానికి తిరుగులేని సాక్ష్యమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెట్రోలియం శాఖలోని పెట్రోలియం ప్లానింగ్, విశ్లేషణ విభాగం చెబుతున ్న దాని ప్రకారం 2014-15లో డీజిల్ వాడకం 1.5 శాతం పెరగ్గా, పెట్రోల్ వాడకం మాత్రం ఏకంగా 11.4 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో పెట్రోల్ వాడకం 18.7 శాతం, డీజిల్ వాడకం 9.3 శాతం పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement