
న్యూఢిల్లీ: గత నెలలో ఆర్‌బీఐ కీలక రేట్లకు మరో విడత కోత పెట్టిన తర్వాత నుంచి సుమారు అరడజను ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రుణాలపై రేట్లను పావు శాతం వరకు తగ్గించాయి. దీంతో గృహ, ఆటో, ఇతర రుణాలు చౌకగా మారాయి. ఆర్‌బీఐ పాలసీ రేట్లకు అనుగుణంగానే .. రిటైల్ విభాగం, ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలపై రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు, రెపో ఆధారిత రుణ రేటు నవంబర్ 1 నుంచి 8 శాతంగా ఉంటుందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌ను 15 బేసిస్ పాయింట్లు(0.15శాతం), ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచే వీటిని అమల్లోకి తీసుకొచ్చింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే వివిధ కాల పరిమితుల రుణాలపై రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్ రేటు 8.40 శాతానికి దిగొచ్చింది. రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించి 8.45 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గించింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు, అక్టోబర్ 10 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో సెంట్రల్ బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేటు 8 శాతానికి తగ్గగా, ఎంఎస్‌ఈ రుణ రేట్లు 8.95–9.50 శాతానికి తగ్గాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సైతం ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్ రేటును 8.4 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వడ్డీ తగ్గింపు
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (పీపీబీ) సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ రేటును అర శాతం తగ్గించి 3.5 శాతం చేసింది. నవంబర్ 9 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పీపీబీ ప్రకటించింది. ఆర్‌బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం మేర తగ్గించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు పీపీబీ సీఈవో, ఎండీ సతీష్‌కుమార్ గుప్తా తెలిపారు. 7.5 శాతం వడ్డీ రేటుతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని కూడా పీపీబీ ప్రకటించింది. పీపీబీ భాగస్వామ్య బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా ఈ వడ్డీ రేటు పొందొచ్చు.