
మూడో వంతు ఏటీఎంలు పనిచేయడం లేదు
ముంబై: దేశంలో 3వ వంతు ఏటీఎంలు పనిచేయడం లేదంటూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా ఆందోళన వ్యక్తంచేశారు. బ్యాంకులు తక్షణం ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారమిక్కడ ఒక బ్యాంకింగ్ కార్యక్రమంలో మాట్లాడారు. ఏటీఎంలకు సంబంధించి ఆర్‌బీఐ రూపొందించిన నిబంధ నలను కూడా బ్యాంకులు సక్రమంగా అవలంభించడం లేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల ఆర్‌బీఐ బృందం దేశవ్యాప్తంగా, పలు బ్యాంకులకు సంబంధించిన 4,000 ఏటీఎంలపై ఒక సర్వే నిర్వహించింది. దీన్లో మూడో వంతు పనిచేయడం లేదని బయటపడింది.