ఆర్‌బీఐ బేస్‌రేటు ఫార్ములాతో రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయ్
రూ. 100 కోట్లతో గచ్చిబౌలిలో ఎస్‌బీహెచ్ ప్రధాన కార్యాలయం
- ఎస్‌బీహెచ్ సైబరాబాద్ జోన్ ప్రారంభం
- అందుబాటులోకి మొబైల్ యాప్ ‘ఎస్‌బీహెచ్ టచ్’
- ఎస్‌బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి ఆర్‌బీఐ పరపతి సమీక్షతో సంబంధం లేకుండా బేస్ రేటు తగ్గే అవకాశం ఉందని ఎస్‌బీహెచ్ పేర్కొంది. బేస్‌రేటు నిర్ణయించడానికి ఆర్‌బీఐ నిర్దేశించిన కొత్త ఫార్ములా ప్రకారం దాదాపు అన్ని బ్యాంకులు బేస్ రేటును తగ్గించాల్సి వస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్ రేటు తగ్గించడం వల్ల ఇతర బ్యాంకులపై ఎటువంటి ఒత్తిడి లేదని, త్వరలోనే మా బ్యాంక్ అసెట్ లయబిలిటీ కమిటి సమావేశమై బేస్‌రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటందన్నారు. సోమవారం హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డీరేట్లు తగ్గుతున్నా ఇంకా కార్పొరేట్ రుణాల్లో ఎటువంటి వృద్ధి కనిపించడం లేదన్నారు.
డిమాండ్ ఉన్న రిటైల్, ఎస్‌ఎంఈ రంగాలపై తాము అధికంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ఎస్‌బీహెచ్ 17వ జోనల్ ఆఫీసు ‘సైబరాబాద్‌జోన్’ను ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించారు. దీంతోపాటు మొబైల్ యాప్ ‘ఎస్‌బీహెచ్ టచ్’ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్ మీద మాత్రమే పనిచేస్తుందని, త్వరలోనే ఐవోస్ ఫ్లాట్‌ఫామ్ మీద కూడా దీన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఏడాదిన్నరలో సిద్ధం
గచ్చిబౌలి ఆర్థిక జిల్లాలో ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న ఎస్‌బీహెచ్ ప్రధాన కార్యాలయం ఏడాదిన్నరలో సిద్ధమవుతుందన్నారు. ప్రస్తుత పాత కార్యాలయం ఇరుకుగా ఉండటంతో రూ. 100 కోట్ల అంచనాతో కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు ముఖర్జీ తెలిపారు. ప్రస్తుత కార్యాలయం విస్తీర్ణం 1.3 లక్షల చదరపు అడుగులు ఉంటే కొత్త కార్యాలయంలో 2.28 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తుందన్నారు.