
డిజిటల్ కరెన్సీదే భవిష్యత్తు: జైట్లీ
నగదు వాడకాన్ని తగ్గించాలనుకుంటున్నట్టు వెల్లడి
న్యూఢిల్లీ: నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్ చెల్లింపులవైపు అడుగు వేయాలని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం రాజ్యసభలో నోట్ల రద్దుపై ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... ప్రభుత్వం నగదు వాడకాన్ని తగ్గించి... దీనికి ప్రత్నామ్నాయంగా డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని పెంచాలని అనుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 80కోట్ల డెబిట్ కార్డుల్లో 40 కోట్ల కార్డులను ఏటీఎం కేంద్రాలలో చురుగ్గా ఉపయోగిస్తున్నారని వివరించారు.
ఎలక్ట్రానిక్ వ్యాలెట్లు, ఆన్‌లైన్ నగదు బదిలీలు భవిష్యత్తు తరం టెక్నాలజీలని... వీటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కూడా కోరినట్టు జైట్లీ తెలిపారు. నగదు రహిత వ్యవస్థపై ప్రచారం, అవగాహన కోసం ఓ నిధి కూడా అమల్లో ఉందన్నారు. నగదు రహిత సమాజం అంటే తక్కువ నగదు కలిగి ఉండడం, చెల్లింపుల్లో పారదర్శకత, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టడంగా మంత్రి పేర్కొన్నారు.