జీఎస్టీ మహిమ: దిగొచ్చిన రెనాల్ట్ కార్ల రేట్లు
Published Wed, Jul 5 2017 6:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
న్యూఢిల్లీ : జీఎస్టీ మహిమతో రెనాల్ట్ కార్ల రేట్లు కిందకి దిగొచ్చాయి. ఫ్రెంచ్‌కు చెందిన ఈ కారు దిగ్గజం తమ వాహనాలన్నింటిపైనా భారత్‌లో 7 శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్టు నేడు(బుధవారం) ప్రకటించింది. దీంతో రూ.5,200 నుంచి రూ.1.04 లక్షల శ్రేణిలో ధరలు తగ్గాయి. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయాలనే లక్ష్యంతో తాము వాహనాల ధరలను తగ్గించామని రెనాల్ట్ ఇండియా చెప్పింది.
రెనాల్ట్ హ్యాచ్ బ్యాక్ క్విడ్ క్లెంబర్ ఏఎంటీ ధరలు రూ.5,200 నుంచి రూ.29,500 మధ్యలో తగ్గగా.. ఎస్‌యూవీ డస్టర్ ఆర్‌ఎక్స్‌జెడ్ ఏడబ్ల్యూడీ ధర రూ.30,400 నుంచి రూ.1,04,700 వరకు తగ్గింది. అదేవిధంగా లాడ్జి స్టెప్‌వే ఆర్‌ఎక్స్‌జెడ్ ధర కూడా రూ.25,700 నుంచి రూ.88,600 మధ్యలో కిందకి దిగొచ్చింది.
తమ కస్టమర్-ఫస్ట్ విధానం కింద, జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీచేయాలని నిర్ణయించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సావ్నీ ఓ ప్రకటనలో చెప్పారు. జీఎస్టీని అమలుచేయడం ప్రభుత్వ అతిపెద్ద విజయాల్లో ఒకటని ఆయన కొనియాడారు. ఇది వ్యాపారాల్లో అనుకూల వాతావరణ వృద్ధిని నెలకొల్పుతుందన్నారు. మొత్తం వ్యవస్థ ఒకేసారి దీనిలోకి మారడంలో స్వల్పకాలిన కొంత అంతరాయం కలిగే అవకాశముందని, కానీ దీర్ఘకాలికంగా ఇది కార్పొరేట్ ఇండియా, ఆర్థిక వ్యవస్థలో చాలా సానుకూలంగా ఉంటుందని సావ్నీ చెప్పారు.
Advertisement
Advertisement