ఆర్ ఐఎల్ అదనపు వ్యయాల రికవరీకి బ్రేక్!
♦ కేజీ బేసిన్‌పై కాగ్ నివేదిక
♦ ఆచితూచి వ్యవహరించాలని సూచన
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్ డీ6 గ్యాస్ బ్లాక్‌లో 1.6 బిలియన్ డాలర్ల అదనపు వ్యయాల రికవరీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తాజాగా బ్రేక్ వేసింది. బ్లాక్ నుంచి ఆయిల్, గ్యాస్ విక్రయం ద్వారా అదనపు వ్యయాల రికవరీకి అంగీకరించరాదని పార్లమెంటులో ప్రవేశపెట్టిన తన తాజా నివేదికలో పేర్కొంది. డిస్కవరీ ధ్రువీకరణకు జరిపిన పరీక్షలకు సంబంధించి డిమాండ్ చేస్తున్న అదనపు వ్యయ రికవరీల విషయాన్ని కూలంకషంగా పునఃపరిశీలించాలని సూచించింది.
ఓఎన్‌జీసీ గ్యాస్ ఫ్లోపైనా దృష్టి...
ముకేశ్ అంబానీ సంస్థ నియంత్రణలోని తూర్పు ఆఫ్‌షోర్ ఫీల్డ్స్‌లోకి ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్ ఫ్లోయింగ్ విషయాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. 2015 నవంబర్ డీగోల్యర్ అండ్ మెక్‌నాటన్ (డీఅండ్‌ఎం) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్న విషయాన్ని గుర్తుచేసింది. ఈ సమస్యపై తదుపరి చర్యల సిఫారసుకు జస్టిస్ ఏపీ షా నేతృత్వంలో ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఒకవేళ డీఅండ్‌ఎం నివేదికను ప్రభుత్వం ఆమోదించి ఓఎన్‌జీసీకి పరిహారం చెల్లించాలని ఆర్‌ఐఎల్‌ను ఆదేశిస్తే.. కేజీ బేసిన్‌లో వ్యాపారం, లాభాలు ఇతర లావాదేవీల ఈ ప్రభావం ఉంటుందని కూడా కాగ్ విశ్లేషించింది.