
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రికార్డు ర్యాలీ చేసిన నేపథ్యంలో అప్రమత్తత అవసరమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కంపెనీ షేరు సోమవారం రూ.1,624 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ కోర్ వ్యాపారాలైన రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌లకు సంబంధించి బ్రోకరేజ్‌లు స్వల్పకాలిక అవుట్‌లుక్‌ను నెగిటివ్‌గా కేటాయించారు. మరోవైపు ఈ ఏడాది మార్చి 31 తేది లోపు పూర్తి కావాల్సిన సౌది ఆరాంకో డీల్‌పై ఇప్పటికి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అలాగే జియో ప్లాట్‌ఫామ్‌లలో ఫేస్‌బుక్ పెట్టుబడులు పెట్టేందుకు రెగ్యులేటరీ అనుమతులు లభించాల్సి ఉంది. ఈ కారణాల దృష్టా‍్య రానున్న రోజుల్లో రిలయన్స్ షేరు రికార్డు ర్యాలీ పట్ల అప్రమత్తత అవసరం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
జియో-ఫేస్‌బుక్ డీల్‌కు ఇంకా అందని సెబీ అనుమతులు
జియో, ఫేస్‌బుక్ మధ్య ఏప్రిల్ 22న డీల్ కుదిరింది. రిలయెన్స్ జియోలో రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటా కోసం ఫేస్‌బుక్ ఈ డీల్‌ను కుదుర్చుకుంది. డాటా వినియోగ కోణం నుంచి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ ఒప్పందాన్ని నిశీతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే కార్పోరేట్ వర్గాలు తెలిపాయి. ఫేస్‌బుక్ తన అనుబంధ యాప్‌లపై వాట్సప్, మెసెంజర్ యాప్‌ల్లో డేటా వినియోగం జియోకు భారీగా కలిసొచ్చే అంశంగా మారనుందని, ఇది ప్రత్యర్థి కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు నష్టాన్ని కలిగించే అంశంగా మారిందని వారు అంటున్నారు. ఈ క్రమంలో సెబీ ఏ చిన్నపాటి అభ్యంతరం వ్యక్తం చేసినా రియలన్స్ షేరుకు ప్రతికూల వార్తగా నిలిచిపోయే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంటున్నారు.
రీఫైనరీ, పెట్రో-కెమికల్స్ వ్యాపారాలపై కోవిద్-19 ఎఫెక్ట్
రిలయన్స్ కోర్ వ్యాపారాలైన రీఫైనరీ, పెట్రో-కెమికల్స్ వ్యాపారాలపై కోవిద్-19 ప్రభావం పడింది. ‘‘ఈ ఏడాదిలో రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ఉత్పత్తుల డిమాండ్ బలహీనంగా ఉండొచ్చు. తద్వారా రిలయన్స్ ఆయిల్-టు-కెమికల్ విభాగాలు వ్యాల్యూమ్, మార్జిన్లు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలో క్రమంగా రికవరిని సాధించే అవకాశం ఉంది’’ అని మే 13న ఫిచ్ బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో పేర్కోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపాదికన రీఫైనరీ, పెట్రోకెమికల్స్ వ్యాపారాల యుటిలిటీ కెపాసిటి దాదాపు 10శాతం క్షీణించవచ్చిన బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
- అలాగే ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ అరాంకోకు విక్రయ ఒప్పందం ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో అనే అంశంపై ఇరు కంపెనీల నుంచి స్పష్టత లేదు.
కోవిడ్-19 ప్రభావంతో కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్న సమయంలో రిలయన్స్ జియోలోకి వరుసగా అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. జియో ఫ్లాట్‌ఫామ్‌లో అంతర్జాతీయ సంస్థలు రూ.97,885 కోట్ల పెట్టబడులు పెట్టడంతో పాటు 30ఏళ్ల తర్వాత ఇటీవల కంపెనీ రూ.53,124 కోట్ల అతిపెద్ద రైట్స్ ఇష్యూను విజయవంతంగా నిర్వహించింది. ఫలితంగా రియలన్స్ షేరు రూ.1,624 వద్ద కొత్త సరికొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది.
కరోనా సంక్షోభంలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు జీవితకాల రికార్డు ర్యాలీని అందుకోవడం విశేషం. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10లక్షల కోట్లను అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ దేశంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు గడిచిన 5ఏళ్లలో 262శాతం పెరిగింది. మూడేళ్లలో 141శాతం, ఏడాదిలో 22శాతం ర్యాలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment