ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం
న్యూఢిల్లీ: పండుగుల సీజన్‌లో మార్కెట్లో రుణ వితరణ పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... అక్టోబర్ 1 నుంచి 9 వరకు తొమ్మిది రోజుల్లో బ్యాంకులు నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో రూ.81,781 కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్ కుమార్ సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో తెలిపారు. ఇందులో నూతనంగా జారీ చేసిన రుణాలు రూ.34,342 కోట్లు అని చెప్పారు.
తదుపరి రుణ మేళా కార్యక్రమం ఈ నెల 21 నుంచి 25 వరకు ఉంటుందని రాజీవ్‌కుమార్ తెలిపారు. బ్యాంకుల వద్ద తగినంత నిధుల లభ్యత ఉందని, అసలైన రుణ గ్రహీతలకు అవి నిబంధనల మేరకు రుణాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి చేయాల్సిన చెల్లింపులు సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి బిల్ డిస్కౌంటింగ్ సదుపాయం అందించాల్సిందిగా బ్యాంకులను కోరినట్టు తెలిపారు. రూ.40,000 కోట్లు పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపులు జరగాల్సి ఉన్నట్టు చెప్పారు.
పీఎంసీ పరిణామాలపై సునిశిత పర్యవేక్షణ
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ)లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పర్యవేక్షిస్తున్నామని, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ హామీ ఇచ్చినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీలైనంత తొందరలో ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు.బ్యాంకుల్లో గరిష్టంగా రూ.లక్ష డిపాజిట్ వరకే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా బీమా ఉండగా, ఈ పరిమితి పెంపును ప్రభుత్వం పరిశీలిస్తుందని, దీన్ని పా ర్లమెంటు ద్వారా చేపడతామని చెప్పారు.
ఒప్పందాలను గౌరవిస్తాం..
ఇంధన రంగంలో, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఒప్పందాలను భారత్ గౌరవిస్తుందని మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందొద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment