
బడ్జెట్ ఆశలతో పెరిగిన మార్కెట్
సెన్సెక్స్ లాభం 178 పాయింట్లు 8,600 దాటిన నిఫ్టీ
మార్కెట్ అప్‌డేట్
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తుందన్న అంచనాలతో బుధవారం స్టాక్ మార్కెట్లు మరింత పుంజుకున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమై, చివరి వరకూ లాభాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ 8,600 పాయింట్లను దాటేసింది. 28,450 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ 28,619-28,424 గరిష్ట-కనిష్ట పాయింట్ల మధ్య కదలాడి చివరకు 178 పాయింట్లు లాభపడి 28,534 పాయింట్ల వద్ద ముగిసింది.
అలాగే నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 8,627 పాయింట్ల వద్ద ముగిసింది. క్యాపిటల్ గూడ్స్, లోహ, విద్యుత్తు, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు లాభాల బాటలోనే కొనసాగాయి. గురువారం పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు ఆచి తూచి వ్యవహరించారని, అందుచేత పెరుగుదల స్వల్పంగానే ఉందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు.
బడ్జెట్ ర్యాలీ!
కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌పైననే ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణల జోరును ఈ బడ్జెట్ సూచిస్తుందని వారు భావిస్తున్నారు. 1990 ఆర్థిక సంస్కరణల అనంతరం స్టాక్ మార్కెట్‌కు ఈ బడ్జెట్ కీలకం కానున్నదని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో వెల్లడించింది. బడ్జెట్‌లో సంస్కరణలు తప్పనిసరిగా చోటు కల్పించాలనే సంకేతం ఆప్ విజయం ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వానికి అందిందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్ జిగ్నేశ్ చౌధురి చెప్పారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ గత కొన్ని సెషన్లలో 1,500 పాయింట్ల వరకూ నష్టపోయిందని, బడ్జెట్ ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని డైమన్షన్స్ కన్సల్టింగ్‌కు చెందిన అజయ్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు.