కొటక్ మహీంద్రాలో సుమిటొమొ వాటాల విక్రయం
విలువ రూ. 2,069 కోట్లు
ముంబై: జపాన్ దిగ్గజం సుమిటొమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్‌ఎంబీసీ) మంగళవారం కొటక్ మహీంద్రా బ్యాంకులో దాదాపు 1.78 శాతం మేర వాటాలను విక్రయించింది. వీటి విలువ దాదాపు రూ. 2,069 కోట్లు. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఎస్‌ఎంబీసీ ఈ వాటాలు విక్రయించింది. కొటక్ మహీంద్రాలో ఎస్‌ఎంబీసీకి 3.58 శాతం వాటాలుండేవి. తాజాగా బీఎస్‌ఈలో 1.81 కోట్ల షేర్లను (0.98%) రూ. 1,152 కోట్లకు, ఎన్‌ఎస్‌ఈలో 1.47 కోట్ల షేర్లను (0.80 శాతం) రూ.917 కోట్లకు విక్రయించింది. బీఎస్‌ఈలో షేర్లు సగటున రూ. 636.25 రేటుకి, ఎన్‌ఎస్‌ఈలో రూ.623.95 ధరకి అమ్ముడయ్యాయి. 1.81 కోట్ల షేర్లను కెనడాకు చెందిన సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు కొనుగోలు చేసింది. 2015 ఆఖరు నాటికి కొటక్ మహీంద్రా బ్యాంకులో సీపీపీకి 3.91% వాటాలు ఉన్నాయి.