గోల్డ్ బాండ్ల ధర గ్రాము రూ.2,901
24 నుంచి 28 వరకూ ఆఫర్
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను శుక్రవారం ఆర్‌బీఐ ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచీ ఏప్రిల్ 28వ తేదీ వరకూ అందుబాటులో ఉండే ఈ బాండ్ ధర గ్రాముకు రూ.2,901 అని ఒక ప్రకటనలో తెలిపింది. బాండ్లు మే 12వ తేదీన జారీ అవుతాయి. సబ్‌స్క్రిప్షన్‌కు వారం ముందు (సోమవారం–శుక్రవారం) ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ నిర్ణయించిన 999 ప్యూరిటీ గోల్డ్ ధర గ్రాముకు సగటున రూ.2,951గా నమోదయ్యింది. దీనితో ముందే నిర్ణయించిన ప్రకారం– బాండ్ ధరను రూ.50 రిబేట్ ప్రాతిపదికన రూ.2,901గా స్థిరీకరించారు.
ఈ బాండ్‌పై వార్షిక వడ్డీ 2.75 శాతం. తొలి ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రతి ఆరునెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. బాండ్ల కాలపరమితి ఐదవ ఏడాది నుంచీ ‘ఎగ్జిట్’ ఆప్షన్‌తో ఎనిమిది సంవత్సరాలు. ఒక వార్షిక సంవత్సరంలో గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ ఈ బాండ్ల ద్వారా కొనుగోలు చేసే వీలుంది. బ్యాం కులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్, బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజ్ ద్వారా బాండ్లు అందుబాటులో ఉంటాయి.