వచ్చే నెల నుంచి ’ఉడాన్’ విమాన సేవలు: స్పైస్‌జెట్
ముంబై: ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ స్కీము కింద వచ్చే నెలలో విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వెల్ల డించింది. ముందుగా ముంబై నుంచి పోర్‌బందర్, కాండ్లాకు రోజు రెండు డైరెక్ట్ ఫ్లయిట్స్ నడపనున్నట్లు వివరించింది. జులై 10 నుంచి 78 సీటింగ్ సామర్థ్యం గల బొంబార్డియర్ క్యూ400 విమానాలను ఈ రెండు కొత్త రూట్లలో సర్వీసులకు ఉపయోగించనున్నట్లు స్పైస్‌జెట్ పేర్కొంది.
ముంబై–పోర్‌బందర్ రూట్లో ఆర్‌సీఎస్ సీట్ల టికెట్ ధర రూ. 2,250 (అన్ని చార్జీలు కలిపి) గాను, ముంబై–కాండ్లా రూట్‌లో రూ. 2,500గాను ఉంటుంది. చిన్న పట్టణాలకూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆర్‌సీఎస్ కింద టర్బో మేఘా తదితర అయిదు ఎయిర్‌లైన్స్‌కి కేంద్రం ఈ ఏడాది మార్చిలో 128 ప్రాంతీయ రూట్లను కేటాయించింది.