ముంబై : దేశీయ అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ కన్ను ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్‌పై పడింది. జెట్ ఎయిర్‌వేస్‌లో అతిపెద్ద మొత్తంలో వాటా దక్కించుకోవాలని టాటా గ్రూప్ చర్చలు జరుపుతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. నరేష్ గోయల్‌కు చెందిన జెట్, పైలెట్లకు వేతనాలు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో పైలెట్లు, సీనియర్ ఉద్యోగులు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, జీతాలను ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లిస్తామని ఈ సంస్థ చెబుతోంది. ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్‌లో టాటా గ్రూప్ మెజార్టీ వాటా దక్కించుకుని, మేనేజ్‌మెంట్ కంట్రోల్ పొందాలని చూస్తోంది.
జెట్ ఎయిర్‌వేస్ ఆ కంపెనీ ప్రమోటర్ నరేష్ గోయల్‌కు 51 శాతం వాటా ఉంది. మిగతా మొత్తంలో 24 శాతం ఇతిహాద్ ఎయిర్‌వేస్, 2.1 శాతం ఎల్‌ఐసీ, 3.6 శాతం ఎంఎఫ్‌ఎస్, ఇతరుల చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం నరేష్ గోయల్‌కు ఉన్న షేరులో 26 శాతం టాటా గ్రూప్ కొనుగోలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాటా రెండు ఏవియేషన్ జాయింట్ వెంచర్లను కలిగి ఉంది. ఒకటి సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆపరేటింగ్ విస్తారా, రెండు బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఏసియా. విస్తారా ఎయిర్‌లైన్, జెట్ ఎయిర్‌వేస్‌కు ఏవియేషన్ మార్కెట్‌లో తీవ్ర పోటీ ఉంది. ఒకవేళ ఈ డీల్ కుదిరితే టాటా గ్రూప్ నెట్‌వర్క్ పరంగా, మార్కెట్ షేరు పరంగా తన ఏవియేషన్ వ్యాపారాలను విస్తరించుకోనుంది. అయితే ఈ విషయాలపై స్పందించడానికి టాటా సన్స్ అధికార ప్రతినిధి నిరాకరిస్తే, జెట్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.
అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కంట్రోలింగ్ హక్కులపై ఇరు సంస్థల నుంచి తేడాలు వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ చర్చలు కనుక సఫలమైతే, ఇతిహాద్, జెట్ ఎయిర్‌వేస్‌లో ఉన్న తన వాటాను విక్రయించనుంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేయాలని టాటాలు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం పెట్టే షరతులతో వీరి బిడ్డింగ్ తుది దశకు చేరుకోలేదు. అసలు ఎయిరిండియా తొలుత టాటాలదే. టాటా ఎయిర్‌లైన్స్‌గా స్థాపించి, ఎయిరిండియాగా పబ్లిక్‌లోకి వచ్చింది. కానీ 1953లో దాన్ని ప్రభుత్వం తన పరం చేసుకుంది. ఇప్పుడు ఎయిరిండియాకు కూడా అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో, దాన్ని అమ్మేయాలని చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment