ధీమాగా పెళ్ళి చేద్దాం
వెడ్డింగ్ ఇన్సూరెన్స్... ఇప్పుడిప్పుడే దేశంలో ప్రాచుర్యం పొందుతోంది. ఏదైనా అనుకోని సంఘటనల వల్ల పెళ్ళి వాయిదా పడినా లేక రద్దు అయిన సందర్భాల్లో చేసిన వ్యయానికి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. ఈ బీమా వేటికి వర్తిస్తుంది? వీటి కాలపరిమితి ఎంత? ప్రీమియం ఎంత? వంటి అంశాలపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం.
భారతీయ సంప్రదాయంలో వివాహం ఓ అనిర్వచనీయమైన, అద్వితీయమైన వేడుక. భారతీయులు పెళ్లికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా భారీగా ఖర్చుచేస్తారు. దేశంలో సగటున ఒక్కో పెళ్ళికి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని ప్రాథమిక అంచనా. అదే ధనవంతులైతే ఈ ఖర్చు కోట్లలోనే ఉంటుంది.
ఇంత వేడుకగా చేసుకునే కార్యక్రమం కొన్ని సందర్భాల్లో వాయిదా పడటమో, లేక రద్దు కావడమో జరుగుతుంటుంది. ఇలాంటి సమయంలో అప్పటికే చేసిన ఖర్చు అంటే.. కల్యాణ మండపం, కేటరింగ్, డెకరేషన్ వంటి వాటికి ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి వచ్చే అవకాశం ఉండదు. దీంతో ఆర్థికంగా తీవ్ర నష్టం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అక్కరకు వస్తుంది.
వేటికి బీమా...
ఏదైనా ప్రకృతి వైపరీత్యం, అగ్నిప్రమాదం, తీవ్రవాదుల దాడులు, బంద్‌ల వలన ఆగిపోయినా, పెళ్ళి కూతురు, పెళ్ళికొడుక్కి అస్వస్థత లేదా ప్రమాదం సంభవించినా, లేదా సమీప బంధువులు చనిపోవడం వలన ఆగిపోయిన సందర్భాల్లో ఈ బీమా కవరేజ్ వర్తిస్తుంది. పెళ్ళికొడుకు లేదా పెళ్ళి కూతురు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కొని వివాహం ఆగిపోతే కూడా బీమా రక్షణ లభిస్తుంది. ఇటువంటి సమయంలో పెళ్ళి కోసం చేసి, వెనక్కి తీసుకోలేని ఖర్చులను బీమా కంపెనీ చెల్లిస్తుంది.
ఇవే కాకుండా కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ఇతర సంఘటనలు అంటే... పెళ్ళిలో ఏదైనా దొంగతనం జరిగితే, ఆహారం కలుషితమై దాని వలన అతిథులకు అస్వస్థత సంభవిస్తే వాటికి కూడా బీమా రక్షణ ఉంది. కట్నం కోసం, లేదా వరుడు, వధువుల మధ్య అపోహలతో వివాహం రద్దయిన సందర్భాల్లో, తీవ్రవాద సంబంధిత దాడులు, పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురు కిడ్నాప్ వంటి సంఘటనల వల్ల ఆగిపోతే మాత్రం బీమా రక్షణ ఉండదు. పాలసీ తీసుకునే ముందే వేటికి బీమా రక్షణ ఉంటుంది వేటికి ఉండదన్న విషయంపై అవగాహన పెంచుకోండి.
ఎంతకాలం?
సాధారణంగా ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌లు వారం రోజుల నుంచి 15 రోజుల వరకు బీమా రక్షణను కల్పిస్తాయి. పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురిని చేయడం, లేదా సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలు మొదలయ్యే 24 గంటల ముందు నుంచి పెళ్ళి తంతు ముగిసే వరకు బీమా రక్షణ ఉంటుంది.
ప్రీమియం ఎంత?
వీటికి చెల్లించే ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఎంచుకున్న బీమా మొత్తం ఆధారంగా ప్రీమియం ఉంటుంది. బీమా రక్షణ మొత్తాన్ని శుభలేఖల ముద్రణ, కేటరింగ్, కల్యాణ మండపాలు, రవాణా వంటివాటికి ఇచ్చిన అడ్వాన్స్‌ను బట్టి లెక్కిస్తారు. సాధారణంగా బీమా మొత్తంలో కనిష్టంగా 0.7% నుంచి గరిష్టంగా 2 శాతం వరకు ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకు ఒక ప్రైవేటు బీమా కంపెనీ రెండు లక్షల నుంచి 8 లక్షల మొత్తానికి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కోసం రూ.3,800 నుంచి రూ.14,500 వరకు ప్రీమియం వసూలు చేస్తోంది. అదే పెళ్ళికి వచ్చిన వారికి కూడా బీమా రక్షణ కావాలంటే అదనంగా మరో రూ.1,000 చెల్లించాలి.
ఎవరు ఇస్తున్నారు?
దాదాపు అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలు వెడ్డింగ్ బెల్స్ పేరుతో ఈ పాలసీలను అందిస్తున్నాయి. అలాగే ప్రైవేటు కంపెనీలు ఐసీఐసీఐ లాంబార్డ్, బజాజ్ అలయెంజ్ వంటి కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి.
కొన్ని కంపెనీలు ఇలా ప్రత్యేకంగా అందించకపోయినా ఈవెంట్ ఇన్సూరెన్స్ రూపంలో ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నప్పటికీ ఇవి అంతగా ఆదరణ పొందడం లేదు. శుభకార్యక్రమమైన పెళ్ళి ఏదైనా అవాంతరం వలన ఆగిపోతే... అన్న పదాన్ని భారతీయులు అంగీకరించకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఏజెంట్లు పేర్కొంటున్నారు.
క్లెయిమ్ ఎలా?..
ఏదైనా సంఘటన వల్ల వేడుక రద్దు అయితే 30 రోజుల్లోగా సమాచారాన్ని బీమా కంపెనీకి తెలపాలి. దీనికి సంబంధించిన కాగితాలను జతచేస్తూ క్లెయిమ్ ఫాం అందజేయాలి. చేసిన ఖర్చుకు సంబంధించి ప్రతీ పైసాకి ఆధారాలు జతచేయాలి. అదే దొంగతనం వంటి సంఘటనలు జరిగితే జరిగిన ఆర్థిక నష్టాన్ని ధ్రువీకరించే ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా జత చేయాల్సి ఉంటుంది.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం