విప్రో లాభం 2,235 కోట్లు | Wipro posts bigger Q2 profit, sees muted Q3 | Sakshi
Sakshi News home page

విప్రో లాభం 2,235 కోట్లు

Published Thu, Oct 22 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

విప్రో లాభం 2,235 కోట్లు

విప్రో లాభం 2,235 కోట్లు

క్యూ2లో 7.2 శాతం వృద్ధి
 
*  ఆదాయం రూ. 12,567 కోట్లు; 6.3 శాతం అప్
గడిచిన క్వార్టర్(క్యూ2)లో కంపెనీ అన్ని విభాగాల్లో మంచి పురోగతిని కనబరిచింది. ఐటీ సేవల రంగంలో డాలరు రూపేణా(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 3.1 శాతం ఆదాయ వృద్ధిని సాధించాం. రానున్న కాలంలో స్థిరమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం. ఇక పెద్ద డీల్స్ విషయంలో పోటీ తీవ్రంగా ఉంది. కొత్త కాంట్రాక్టులకు సంబంధించి ప్రైసింగ్ ఒత్తిళ్లు కూడా కొనసాగే అవకాశం ఉంది.
 - టీకే కురియన్, విప్రో సీఈఓ

 
బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో... ఈ ఏడాది రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో రూ.2,235 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,085 కోట్లతో పోలిస్తే లాభం 7.2 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ2లో 6.3 శాతం వృద్ధితో రూ.11,816 కోట్ల నుంచి రూ.12,567 కోట్లకు ఎగబాకింది.
 
సీక్వెన్షియల్‌గా...
కాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1-రూ.2,188 కోట్లు)తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా కంపెనీ లాభం 2.1 శాతం మాత్రమే పెరిగింది. ఆదాయం కూడా క్యూ1లో రూ.12,371 కోట్లతో పోలిస్త్తే... స్వల్పంగా 1.6 శాతం వృద్ధి నమోదైంది.
 
ఐటీ సేవల విషయానికొస్తే..
కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఐటీ సేవల విభాగం ఆదాయం క్యూ2లో రూ.12,043 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.10,923 కోట్లతో పోలిస్తే... 10.2 శాతం ఎగసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే(క్యూ1లో రూ. 11,573 కోట్లు) 4 శాతం పెరిగింది. డాలర్ల రూపంలో సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం 2.1 శాతం వృద్ధితో 1.83 బిలియన్లుగా నమోదైంది. తమ అంచనా(గెడైన్స్) 1.82-1.85 బిలియన్ డాలర్లకు అనుగుణంగానే ఐటీ సేవల ఆదాయం నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక ప్రస్తుత మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయం 1.841-1.878 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చిన కంపెనీ అంచనా వేసింది.
 
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
* క్యూ2లో 67 కొత్తగా క్లయింట్లను దక్కించుకుంది.
* ఐటీ ఉత్పత్తుల విభాగ ఆదాయం రూ.544 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ2లో రూ.915 కోట్లతో పోలిస్తే 40.5% దిగజారింది.
* ఐటీ సేవల విభాగంలో కంపెనీ గత క్వార్టర్‌లో 6,607 మందిని నియమించుకుంది. దీంతో సెప్టెంబర్ చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,68,396కు చేరింది.
* ఈ ఏడాది డిజిటల్ టెక్నాలజీలకు సంబంధించి దాదాపు 10,000 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఒక ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు విప్రో వెల్లడించింది.
* క్రాస్-కరెన్సీ(డాలరుతో ఇతర ప్రధాన కరెన్సీల విలువల్లో హెచ్చుతగ్గులు) ప్రభావం నిర్వహణ మార్జిన్లపై పడినప్పటికీ.. డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గుదలతో దీన్ని ఎదుర్కోగలినట్లు కంపెనీ సీఎఫ్‌ఓ జతిన్ దలాల్ చెప్పారు.
* యూరప్, అమెరికాల్లో సెలవుల సీజన్ కారణంగా డీల్స్ కుదుర్చుకోవడంలో మందగమనం, తక్కువ పనిదినాల కారణంగా క్యూ3 ఆదాయాలపై ప్రభా వం చూపనునందని కంపెనీ పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ధర బుధవారం బీఎస్‌ఈలో 1 శాతం పెరిగి రూ.578 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement