మెప్పించని విప్రో..!
క్యూ4 నికర లాభం రూ. 2,286 కోట్లు; 2.1% వృద్ధి
⇒ ఆదాయ వృద్ధి 3.9 శాతం; రూ. 12,171 కోట్లు
⇒ షేరుకి రూ.7 తుది డివిడెండ్...
⇒ బోర్డులోకి ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ...
బెంగళూరు: భారత్‌లో మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో.. మిశ్రమమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. అయితే, విప్రో ప్రేమ్‌జీ పెద్ద కుమారుడు రిషద్ ప్రేమ్‌జీని బోర్డులోకి తీసుకురావడం ఈసారి ఫలితాల ప్రకటనలో కీలకంగా నిలిచింది.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 2.1 శాతం వృద్ధితో రూ.2,286 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.2,239 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.11,704 కోట్ల నుంచి రూ.12,171 కోట్లకు పెరిగింది. 3.9 శాతం వృద్ధి చెందింది. ఇక ప్రధానమైన ఐటీ సేవల ఆదాయం క్యూ3లో 6 శాతం వృద్ధి చెంది రూ.11,240 కోట్లకు చేరింది. డాలర్ల రూపంలో చూస్తే 1.77 బిలియన్ డాలర్లు(3.2% వృద్ధి)గా నమోదైంది.
మార్కెట్ వర్గాలు సగటున క్యూ3లో ఐటీ సేవల ఆదాయం రూ.11,399 కోట్లు(డాలర్లలో 1.79 కోట్లు) ఉండొచ్చని అంచనా వేయగా.. దీనికంటే తక్కువగానే కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) తొలి త్రైమాసికం(క్యూ1, ఏప్రిల్-జూన్)కు ఆదాయ అంచనా(గెడైన్స్) తగ్గింది. 1.76-1.79 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని కంపెనీ పేర్కొంది.
సీక్వెన్షియల్‌గా చూస్తే...
డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే(క్యూ2) కంపెనీ లాభం సీక్వెన్షియల్‌గా 3.7 శాతం పెరిగింది. క్యూ2లో లాభం రూ.2,203 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.12,085 కోట్ల నుంచి నామమాత్రంగా 0.7 శాతం పెరిగింది. సీక్వెన్షియల్‌గా ఐటీ సేవల ఆదాయం డాలర్ల రూపంలో 1.2 శాతం, రూపాయి ప్రాతిపదికన 0.9 శాతం క్షీణించడం గమనార్హం. ‘డిజిటల్, ఓపెన్‌సోర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు భవిష్యత్తు వ్యాపారాభివృద్ధిలో కీలక పాత్ర పోషించునున్నాయి.
కొన్ని విభాగాల్లో ఇబ్బందులు నెలకొన్నప్పటికీ.. మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అని విప్రో సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం నుంచి వ్యాపారంలో కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. తయారీ, హెల్త్‌కేర్, రిటైల్‌లో పటిష్టమైన వృద్ధి కనబడుతోందన్నారు.
పూర్తి ఏడాదికి ఇలా...
2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 11.03 శాతం ఎగబాకి రూ.8,706 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది లాభం రూ.7,840 కోట్లుగా ఉంది. ఇక ఆదాయం 8.14 శాతం వృద్ధితో రూ. 43,754 కోట్ల నుంచి రూ.47,318 కోట్లకు ఎగసింది. కాగా, ఐటీ సేవల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధి చెంది రూ.44,020 కోట్లుగా నమోదైంది. డాలర్ల రూపంలో చూస్తే ఈ మొత్తం 7.08 బిలియన్ డాలర్లు(7 శాతం వృద్ధి).
ఇతర ముఖ్యాంశాలు...
⇒ మార్చి చివరినాటికి ఐటీ సేవల విభాగంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,58,217కు చేరింది.
⇒ క్యూ4లో కొత్తగా 65 మంది క్లయింట్లను కంపెనీ దక్కించుకుంది.
⇒ రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుపై కంపెనీ రూ.7 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
⇒ కంపెనీ షేరు మంగళవారం బీఎస్‌ఈలో 0.67% నష్టంతో రూ.579 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలొచ్చాయి.
వారసుడొచ్చాడు...
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తన వారసత్వ పగ్గాలను అప్పగించేందుకు తొలి అడుగు పడింది. చాన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన పెద్ద కుమారుడు 38 ఏళ్ల రిషద్ ప్రేమ్‌జీని విప్రో డెరైక్టర్ల బోర్డులోకి తీసుకొచ్చారు. హోల్‌టైమ్ డెరైక్టర్‌గా ఆయనను నియమిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నియామకం ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కంపెనీ వ్యూహాల్లో, విలీనాలు-కొనుగోలు డీల్స్ విషయంలో ఆయన కీలకమైన పాత్రను పోషిస్తూవస్తున్నారని కూడా వెల్లడించింది. కాగా, రిషద్ ఇప్పటికే విప్రో ఎంటర్‌ప్రైజెస్(ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్ సంస్థ), విప్రో-జీఈ జాయింట్ వెంచర్ సంస్థ, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లో బోర్డు సభ్యుడిగా కొనసాగుతుండటం గమనార్హం.
హార్వర్డ్‌లో విద్యాభ్యాసం చేసిన రిషద్... 2007 జూన్‌లో తొలిసారిగా బిజినెస్ మేనేజర్ స్థాయిలో కంపెనీలోకి ప్రవేశించారు. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో ప్రత్యేక ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. మూడేళ్ల తర్వాత కంపెనీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా, తాజా నియామకంతో ఇక టాప్ పోస్టుకు మార్గం సుగమమైనట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, చిన్న కొడుకు తారిక్ ప్రేమ్‌జీ విప్రో ఫౌండేషన్‌లో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం విప్రోలో ప్రేమ్‌జీకి నేరుగా 3.78 శాతం వాటా ఉండగా.. ఆయనకు చెందిన ఇతర సంస్థల ద్వారా దాదాపు 70 శాతం వాటా ఉంది. మార్చి చివరినాటికి విప్రోలో రిషద్ వాటా 0.03 శాతం. 1945 డిసెంబర్‌లో అజీమ్ ప్రేజ్‌జీ(69 ఏళ్లు) విప్రోను నెలకొల్పారు. ప్రస్తుతం 17.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 48వ స్థానంలో ఉన్నారు. కాగా, వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగానే రిషద్‌కు బోర్డులో చోటు దక్కిందని సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు.