వ్యవ‘సాయం’లో మహీంద్రా ట్రింగో
♦ అద్దెకు ట్రాక్టర్లు, యంత్రాలు
♦ సొంత యంత్రాలుంటే... వారే ఫ్రాంచైజీలు
♦ దశలవారీగా దేశవ్యాప్త విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్రాక్టర్లు కొనలేని వారికి వాటిని అద్దెకివ్వటం కూడా చేయాలని వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది. ఇందుకోసం ‘ట్రింగో’ పేరిట ఓ యాప్ ద్వారా పలు సేవల్ని అందుబాటులోకి తెస్తోంది. సాగుకు కావాల్సిన ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను అద్దెకివ్వడమే ఈ కొత్త సేవల లక్ష్యం. ఖరీదైనవి కావడంతో లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, యంత్ర పరికరాల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. వ్యవసాయం ఒకవంక పెరుగుతున్నా... ట్రాక్టర్ల పరిశ్రమ గతంలో ఏడాదికి 6.30 లక్షల యూనిట్లు విక్రయించి... ఇపుడు 5 లక్షల లోపే నమోదు చేస్తోందంటే... కారణమదే.
దీంతో ఫ్రాంచైజీలను ప్రోత్సహించడం ద్వారా తక్కువ అద్దెకు అత్యాధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచాలని మహీంద్రా భావిస్తోంది. ట్రింగో యాప్ లేదా ఫోన్ ద్వారా రైతులు తమ అవసరం ఏంటో చెబితే చాలు... చెప్పిన సమయానికి పొలం ముందు ఇవి ప్రత్యక్షమవుతాయి. తొలుత ఈ సేవలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో అందుబాటులోకి రానున్నాయి. దశల వారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.
అదనపు ఆదాయం..: రెండు మూడు నెలల అవసరానికి ట్రాక్టర్లు, యంత్రాలను కొనుగోలు చేయడం వృథా అన్న భావన చాలామందికి ఉంటుంది. మరోవైపు రైతులందరికీ వీటిని కొనుగోలు చేసే స్తోమత లేదని మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా చెప్పారు. ఇటువంటి వారికి ట్రింగో పెద్ద ఉపశమనమని చెప్పారాయన. కాగా, ట్రాక్టర్లు, వీడర్లు, రైస్ ట్రాన్స్‌ప్లాంటర్, ఫెర్టిలైజర్ స్ప్రెడర్, హార్వెస్టర్, బేలర్, ష్రెడ్డర్, ముల్చర్, కేన్ థంపర్ తదితర యంత్రాలు సొంతానికి కొన్నా వీటి వినియోగం కొన్ని రోజులకే పరిమితమవుతోంది. మిగిలిన రోజులు ఓ మూలన పడి ఉంటున్నాయి. ఇటువంటి యజమానులు ఫ్రాంచైజీలుగా మారి తమవద్ద ఉన్న యంత్రాలను అద్దెకు ఇవ్వవచ్చు. కంపెనీతో చేతులు కలపడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. ట్రింగో అగ్రిగేటర్ పాత్ర పోషిస్తూ రైతులను, యజమానులతో అనుసంధానిస్తుంది. సేవలకుగాను ఫ్రాంచైజీల నుంచి కమిషన్ తీసుకుంటుంది. మహీంద్రాతోపాటు ఇతర బ్రాండ్ల ట్రాక్టర్లనూ అద్దెకు ఇవ్వవచ్చు.
నియంత్రణలో చార్జీలు..: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కస్టమ్ హైరింగ్ స్కీంలో మహీంద్రా సైతం భాగస్వామిగా ఉంది. రైతులకు తక్కువ ధరకే అద్దెకు ట్రాక్టర్లు, యంత్రాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతోనూ తాము చర్చిస్తున్నామని సాహా తెలిపారు. గుజరాత్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. ఔత్సాహికులకు వ్యాపార అవకాశమని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇక ట్రింగో సేవల్లో యంత్రాలు, నేల రకాలు, సమయాన్నిబట్టి అద్దె ఎంత ఉండాలో మహీంద్రా నిర్ణయిస్తుంది.
మహీంద్రాతో తొలి అడుగు..
భారత్‌లో ట్రాక్టర్లు, యంత్రాల అద్దె వ్యాపారం పూర్తిగా అవ్యవస్థీకృత రంగంలో ఉంది. ఏటా రూ.15,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. మహీంద్రా అడుగు పెట్టడం ద్వారా పరిశ్రమకు కొత్తరూపు రానుంది. మరో విశేషమేమంటే ట్రాక్టర్ల అమ్మకాల పరంగా భారత్‌లో తొలి స్థానాన్ని సొంతం చేసుకున్న మహీంద్రా... వ్యవసాయ పనిముట్ల తయారీలోనూ తనదైన ముద్రవేసింది. 2015-16లో సుమారు 5 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయితే దీన్లో 41 శాతం వాటా మహీంద్రాకు ఉంది. 85-90 శాతం మంది వాయిదా పద్ధతిలో ట్రాక్టర్లను, యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. తమ కస్టమర్లలో ప్రస్తుతం 35-40 శాతం మందికి మహీంద్రా ఫైనాన్స్ రుణం సమకూరుస్తోందని కంపెనీ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.సాహా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.