ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఇదే.. | World Costly Royal Jelly Honey Special Story | Sakshi
Sakshi News home page

‘రాయల్‌’ హనీ @1.5 లక్షలు!

Published Wed, Aug 7 2019 10:43 AM | Last Updated on Wed, Aug 7 2019 10:49 AM

World Costly Royal Jelly Honey Special Story - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తేనె అంటే ఇష్టపడని వారుండరు. సహజసిద్ధమైంది కావడం, ఔషధ గుణాలు బోలెడు ఉడడం, అలాగే రుచిలో మేటి కారణంగా దీని స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. మినరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్‌ నిండుగా ఉండడంతో ఫుడ్‌ సప్లిమెంట్స్, సౌందర్య సాధనాలతోపాటు ఔషధాల తయారీలో కూడా తేనెను విరివిగా వాడుతున్నారు. ఒక్క భారత్‌ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పాదనకు డిమాండ్‌ 365 రోజులూ ఉంటుంది. భారత్‌లో తేనె వ్యాపారం విలువ 2018లో సుమారు రూ.1,560 కోట్లు నమోదైంది. ఏటా 10.2 శాతం వృద్ధితో 2024 నాటికి ఇది రూ.2,806 కోట్లకు చేరుకోనుందని మార్కెట్‌ వర్గాల సమాచారం. 

వందకుపైగా రకాలు..
తేనెటీగలు 300–350 రకాల పూల నుంచి హనీని సేకరిస్తాయి. ఫ్లవర్స్‌ నాణ్యతనుబట్టి రంగు, రుచి, వాసన, టెక్స్‌చర్‌ మారుతుంది. తెలుపు, పసుపు, నలుపు, గోధుమ తదితర వర్ణాల్లో తేనె లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా రకాల హనీ తయారవుతోంది. ‘మూడు నుంచి ఆరు వారాల జీవిత కాలం ఉండే తేనెటీగ సుమారు 10 గ్రాముల తేనెను ఉత్పత్తి చేస్తుంది. 40 లక్షల పూల నుంచి సేకరించిన మకరందంతో 4 కిలోల తేనెతుట్టె సిద్ధమవుతుంది. దీని నుంచి 1 కిలో తేనె వస్తుంది’ అని జీనోమ్‌ల్యాబ్స్‌ బయో ఈడీ అశోక్‌ కుమార్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. తేనెను వేరు చేయగా వచ్చే నీరు, పుప్పొడిని ఫుడ్‌ సప్లిమెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, మెడిసిన్స్‌లో వాడుతున్నారు. ‘అరుదైన తేనెతో విభిన్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాం. ఫ్లోనీ బ్రాండ్‌లో ప్రీమియం వెరైటీలను ఇప్పటికే ప్రవేశపెట్టాం’ అని తెలిపారు.

వినియోగం, తయారీలోనూ..: వినియోగం పరంగా యూఎస్, యూరప్, చైనా, భారత్, ఆస్ట్రేలియా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. ప్రీమియం హనీ ఉత్పత్తికి యూరప్‌లోని హంగేరీ పెట్టింది పేరు. యూఎస్, న్యూజీలాండ్, కెనడా, చైనా, భారత్‌లో తేనె పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది. వినియోగం, తయారీ పరంగా భారత్‌ ప్రధాన దేశాల్లో ఒకటిగా నిలిచింది. రూ.1,560 కోట్ల భారత హనీ విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా రూ.1,200 కోట్లుంది. డాబర్, పతంజలి, జంఢు, ఏపిస్, రస్న తదితర బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఇవేగాక ఆర్గానిక్‌ విభాగంలో 24 లెటర్‌ మంత్ర, ప్రో నేచుర్, ఆర్గానిక్‌ తత్వ, నేచుర్‌ ల్యాండ్‌ వంటి బ్రాండ్లు ఉన్నాయి.

పేరుకు తగ్గట్టే రాయల్‌..
మనుక, అకేషియా, లిండేన్, మిల్క్‌వీడ్, బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, క్లోవర్‌ వంటి పూలు చాలా ఖరీదైనవి. పలు దేశాల్లో ఈ పూల మొక్కలతో ప్రత్యేక తేనె ఉత్పత్తి  కేంద్రాలు ఉన్నాయి. రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఈ మొక్కలను పెంచుతున్నారు. వీటి తేనె ఖరీదు కిలోకు రూ.1 లక్షకుపైగా ఉంటోంది. హనీ రకాల్లో అత్యంత ఖరీదైంది రాయల్‌ జెల్లీ. ఇతర వెరైటీలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా పేస్ట్‌ మాదిరి గా ఉంటుంది. క్వీన్‌ బీ నుంచి సేకరించిన 30 ప్లస్‌ గ్రేడ్‌ వెరైటీ కిలో ధర రూ.1.5 లక్షల పైమాటే. ఇది వాడడం వల్ల హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయి కాబట్టే ఈ స్థాయి ఖరీదు ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement