వంద కోట్ల యాహూ ఖాతాల హ్యాకింగ్
• వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి
• మూడు నెలల్లో రెండో ఉదంతం
• వెరిజాన్‌తో యాహూ డీల్‌కు బ్రేక్!!
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ మెయిల్ అకౌంట్లు మరోసారి హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ సారి ఏకంగా వంద కోట్ల పైగా యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు చోరీ అయినట్లు కంపెనీ వెల్లడించింది. 2013ఆగస్టులో ఇది జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్లో దాదాపు 50 కోట్ల మంది యూజర్ల డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు యాహూ వెల్లడించిన కొన్నాళ్లకే అటువంటిదే మరో ఉదంతం చోటుచేసుకోవడంగమనార్హం. గతంలో జరిగిన హ్యాకింగ్ సంఘటనపై విచారణ జరుపుతుండగా.. 2013 నాటి హ్యాకింగ్ విషయం బయటపడినట్లు యాహూ తెలిపింది. ’2013 ఆగస్టులో వంద కోట్ల పైగా యూజర్ ఖాతాల డేటానుఅనధికారిక థర్డ్ పార్టీ చోరీ చేసినట్లు భావిస్తున్నాం’ అంటూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.
నకిలీ కుకీలు ఉపయోగించడం ద్వారా హ్యాకర్లు ఈ ఖాతాల వివరాలు చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపింది.ఈ వివరాలు దుర్వినియోగమైన దాఖలాలేమీ ఇంకా తెలియలేదని పేర్కొంది. ఇప్పటికే తీవ్ర పోటీతో సతమతమవుతున్న యాహూకి ఈ పరిణామం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టనుంది. వెరిజాన్ సంస్థకు ప్రధానఅసెట్స్‌ను 4.8 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు ఉద్దేశించిన డీల్ కూడా ప్రశ్నార్ధకంగా మారనుంది. హ్యాకింగ్‌పై యాహూ విచారణ జరుపుతున్న నేపథ్యంలో పరిస్థితులను పరిశీలిస్తున్నామని వెరిజాన్ పేర్కొంది.అకౌంట్ల భద్రతకు మరిన్ని చర్యలు..యూజర్ల ఖాతాలను మరింత సురక్షితం చేసేందుకు చర్యలు తీసుకున్నామని కంపెనీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు.
గత హ్యాకింగ్ వెనుకున్న ఒక దేశ ప్రభుత్వ అండ గల హ్యాకర్లే ఈడేటా చౌర్యానికీ పాల్పడి ఉంటారని యాహూ పేర్కొంది. చోరీ అయిన వివరాల్లో యూజర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, టెలిఫోన్ నంబర్లు, పుట్టిన తేదీలు, కొన్ని పాస్‌వర్డ్‌లు, వీటితో పాటు అకౌంటు భద్రతాపరమైనప్రశ్నలు.. సమాధానాలు మొదలైనవి ఉండొచ్చని తెలిపింది. అయితే పేమెంట్ కార్డులు లేదా బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్‌లు మొదలైనవి హ్యాకర్లకు చిక్కి ఉండకపోవచ్చని వివరించింది. మరోవైపు, యాహూ ఉపయోగించేటెక్నాలజీ వ్యవస్థలో లోపాలను ఈ ఉదంతాలు ఎత్తిచూపుతున్నాయని ఇంటెల్ సెక్యూరిటీ సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ స్టీవ్ గ్రాబ్‌మాన్ వ్యాఖ్యానించారు. భారీ ఎత్తున యూజర్ల డేటా చేతుల్లో ఉన్న పెద్ద సంస్థలు ఈతరహా దాడులను ఎదుర్కొనేందుకు కేవలం టెక్నాలజీపైనే ఆధారపడకుండా.. అంతర్గత, స్వతంత్ర వనరులను సమర్ధంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.