స్వల్ప లాభంతో సరి
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, విదేశీ ఫండ్స్ లాభాలు స్వీకరించడం తదితర పరిణామాలతో మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. సెన్సెక్స్ 8 పాయింట్లు, నిఫ్టీ 2 పాయింట్లు లాభపడ్డాయి. బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్ తదితర షేర్లు లాభపడటం .. సూచీలు వరుసగా మూడో సెషన్లోనూ పెరగడానికి దోహదపడ్డాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 83 పాయింట్లు పెరిగినప్పటికీ.. లాభాల స్వీకర ణ కారణంగా మళ్లీ తగ్గింది.
గరిష్టంగా 27,478, కనిష్టంగా 27,312 పాయింట్ల స్థాయులను తాకి చివరికి 27,404 వద్ద ముగిసింది. నిఫ్టీ 8,248 వద్ద ముగిసింది. స్థల సేకరణ నిబంధనల సరళతరంతో మంగళవారం ట్రేడింగ్ సానుకూలంగానే మొదలైనప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితులు నెలకొనడం, కమోడిటీల్లో అమ్మకాలు వెల్లువెత్తడం, గ్రీస్‌లో రాజకీయ అనిశ్చితి మొదలైనవి దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని విశ్లేషకులు తెలిపారు.
రిఫైనరీ, విద్యుత్, మెటల్ సంస్థల స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు సెన్సెక్స్‌ను మించి బలపడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటు ఈక్విటీ, అటు డెట్ మార్కెట్లలోనూ తమ పొజిషన్లను తగ్గించుకుంటున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ తెలిపారు.
ఎన్‌ఎస్‌ఈలో స్టాక్స్‌లో రూ. 10,868 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 98,728 కోట్ల టర్నోవరు నమోదైంది. అటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ. 278 కోట్లు, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ. 161 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు.