
వెంకటాంపల్లి పెద్దతండాలో ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న గుంతకల్లు డీఎస్పీ ఖాసీంసాబ్
వజ్రకరూరు : గొర్రెలు మేపడానికి పొలానికెళ్లిన అవ్వకు భోజనం ఇచ్చేందుకు వెళ్లిన ఓ బాలిక (10)పై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శనివారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్దతండాలో చోటుచేసుకోగా.. ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వెంకటాంపల్లి పెద్దతండాకు చెందిన పదేళ్ల బాలిక శనివారం ఉదయం పొలంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన అవ్వకు భోజనం ఇచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యలోనే అదే గ్రామానికి చెందిన డాక్యానాయక్ అనే యువకుడు బాలికను అడ్డగించి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. బాలిక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.
అనంతరం డాక్యానాయక్ అక్కడి నుంచి పారిపోయాడు. అటువైపు వెళుతున్న కొందరు గొర్రెలకాపరులు బాలికను గమనించి వెంటనే గ్రామస్తులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బాలికను ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గుంతకల్లు డీఎస్పీ ఖాసీంసాబ్, వజ్రకరూరు ఎస్‌ఐ ఇబ్రహీం, మహిళా ఏఎస్‌ఐ మంజుల తదితరులు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment