మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే! | Anjani Kumar Says Names Of Non TDP Supporters Found Deleted From Voter List | Sakshi
Sakshi News home page

మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!

Published Thu, Mar 7 2019 3:44 AM | Last Updated on Thu, Mar 7 2019 8:41 AM

Anjani Kumar Says Names Of Non TDP Supporters Found Deleted From Voter List - Sakshi

అమెరికాలోని జార్జియాలో 2018లో గవర్నర్‌ ఎన్నికలు జరిగాయి. దీనికి బ్రెయిన్‌ కెంప్‌–స్టేసీ అబ్రహమ్‌ పోటీపడ్డారు. 2010 నుంచి కొన్నాళ్లు జార్జియా సెక్రటరీగా పని చేసిన కెంప్‌ ఆ ప్రాంతంలో ఉన్న 3.4 లక్షల మంది కలర్‌ మైనార్టీల ఓట్లు వారి ప్రమేయం లేకుండానే తీసేయించేసి లబ్ధిపొందారు. దీన్ని అక్కడి పరిభాషలో ‘రాంగ్లీపర్జ్‌’అని అంటారు. అప్పుడు కెంప్‌ వినియోగించిన విధానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీలో వాడుతోంది.

విజయవాడ ఈస్ట్‌ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న కందుల రంగారెడ్డి, కందుల నాగమణి అమీర్‌పేటలో ఉంటున్నారు. చిత్తూరుకు చెందిన ఓటర్లు వేణుగోపాల్‌రెడ్డి, నాగవేణి సైతం నగరంలో నివసిస్తున్నారు. వీరికి ఐటీ గ్రిడ్స్‌ కాల్‌సెంటర్‌ నుంచి ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వచ్చింది. ఇందులో టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీన్‌ కట్‌ చేస్తే.. ఈ నలుగురూ తమ ప్రమేయం లేకుండానే ఏపీలో ఉన్న ఓట్లు కోల్పోయారు. సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారి సమాచారం మాత్రమే కాదు.. ఏ ఓటర్‌ ఏ పార్టీకి చెందిన వారు అనే సమాచారం ఉంది.  

ఇవి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలివి. ఇలా ఐటీ గ్రిడ్స్‌ సంస్థను అడ్డంపెట్టుకుని టీడీపీ చేస్తున్న ఎన్నో కుట్రల్లో ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే.  

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్‌ రూపొందించిన సేవామిత్ర యాప్‌ను ఆయుధంగా వాడుకుంటూ వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అక్రమంగా లబ్ధిపొందడానికి తెలుగుదేశం పార్టీ భారీ కుట్రకు తెరలేపింది. తమ దురుద్దేశపూర్వక సర్వేల్లో ఎవరైనా తమ పార్టీకీ ఓటు వేయరని తేలినా.. ఆ వ్యక్తి సర్వే సమయంలో సదరు నియోజకవర్గంలో లేకపోయినా వారి ఓట్లు కుట్రపూరితంగా తొలగించేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ ‘కీ’పర్సన్స్‌ కీలకపాత్ర పోషించేవారని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. (ఇదీ జరుగుతోంది!)

మొదటి వారు తమ ఓటర్లు కాదనే ఉద్దేశంతో, రెండో వారు తమకు వేయకపోయే ప్రమాదం ఉందనే అనుమానంతో ఇలా చేసుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ గ్రిడ్స్‌ సాయంతో తెలుగుదేశం పార్టీ చేసిన, చేస్తున్న అక్రమాలపై నగరంలోని ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తు సాగుతోందని ఆయన వివరించారు. వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీలు ఏఆర్‌ శ్రీనివాస్, పి.రాధాకిషన్‌రావులతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

బాధితులంతా నగరంలో ఉంటున్నవారే
హైదరాబాద్‌లోని మధురానగర్‌కు చెందిన దశరథరామిరెడ్డి ఫిర్యాదుతో శనివారం రాత్రి ఐటీ గ్రిడ్స్‌పై ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడితోపాటు ఇప్పటి వరకు గుర్తించిన బాధితులంతా హైదరాబాద్‌లో ఉంటున్న వారే. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి ‘పరిధి’అనే సమస్య ఉత్పన్నం కాదు. తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్‌.. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలు చేస్తోంది. ఓటర్లకు చెందిన వ్యక్తిగత సమాచారం, ఈసారి ఎన్నికల్లో వారి ప్రాధాన్యం, గుర్తింపు పత్రాల వివరాలు.. ఇలా అనేక అంశాలు సేకరిస్తోంది. (‘ఐటీ గ్రిడ్స్‌’పై సిట్‌)

దీనికోసం ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వారు చాలా మంది సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఈ యాప్‌లో ఉంచడానికి ఓ ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. సదరు ఓటరు నియోజకవర్గంలో ఉంటున్నారా? లేదా? స్వతహాగా ఏ పార్టీకీ చెందిన వారు? రానున్న ఎన్నికల్లో ఆయన ఓటింగ్‌ ప్రాధాన్యం ఏ పార్టీకి? ప్రశ్నలకు సమాధానాలను ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌కాల్స్‌ ద్వారా, క్షేత్రస్థాయిలో సర్వేయర్ల ద్వారా సేకరిస్తోంది. దీన్ని ప్రాసెస్‌ చేసిన తర్వాత టీడీపీ వారికి అందిస్తోంది. వారి ద్వారానే ఓటర్‌కు తెలియకుండానే ఓట్లు తొలగిపోతున్నాయి.

అన్ని పార్టీల ఓటర్లతో సర్వే
సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పడంలో వాస్తవం లేదు. ఒక ఓటరు.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అనేది తెలుసుకుని యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఆయా పార్టీకి రేటింగ్స్‌ కూడా ఇస్తూ డేటాబేస్‌ రూపొందించారు. ఐటీ గ్రిడ్స్‌కు చెందిన సేవామిత్ర యాప్‌ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ వ్యతిరేక ఓటర్లను తొలగించి రానున్న ఎన్నికల్లో అక్రమ లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందంటూ ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమే అని పోలీసులు తేల్చారు.

ఈ యాప్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ వారు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉండని, తమ పార్టీకి ఓటు వేయరని భావించిన వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండానే తొలగిస్తున్నారు. సేవామిత్ర యాప్‌లో ఉన్నది తెలుగుదేశం పార్టీ డేటా మాత్రమే అన్నది వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అనేక మంది విద్య, వృత్తి, వ్యాపారాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. అలాంటి వారి ఓట్లను కూడా.. వారి ప్రమేయం లేకుండానే తీసేశారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి వివరాలు, మార్గదర్శకాలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.

ఢిల్లీకి సైబర్‌ క్రైం బృందం
ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై నమోదైన కేసులో సైబరాబాద్‌ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సంస్థ తొలగించిన 80 జీబీ సమాచారాన్ని బయటికి తీసి (రిట్రీవ్‌ చేసిన).. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బుధవారం సైబరాబాద్‌ సైబర్‌ క్రైం బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఈ బృందం ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయం, ఆధార్‌ (యూఐడీఏఐ) కార్యాలయాల అధికారులను కలిసి ఐటీ గ్రిడ్స్‌ దగ్గరున్న డేటా గురించి ఆరా తీయనున్నారు. ఆధార్‌ కార్డు, ఓటరు కార్డుకు సంబంధించిన కలర్‌ ఫొటోలతో కూడిన కాపీలు వీరికెలా వచ్చాయి? అసలు వాటిని ఎవరెవరికి ఇస్తారు? ఇచ్చినా వాటికి సంబంధించిన భద్రతాపరమైన అంశాలేంటి? రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరి పరిరక్షణలో ఈ వివరాలుంటాయి? వీటి గోప్యతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ రహస్య సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ప్రక్రియ ఉందా? ఇస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు.

మరో బృందం బుధవారం కూడా ఐటీ గ్రిడ్స్‌ సంస్థలో డిలీటెడ్‌ సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీని కోసం సైబర్‌ నిపుణులు పోలీసులతో కలిసి పాల్గొన్నారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో సున్నితంగా మారడంతో కేసు దర్యాప్తులో నిర్లక్ష్యాన్నికి తావులేకుండా ప్రతి అంశం కీలకంగా మారింది. దీంతో మరోసారి ఐటీ గ్రిడ్‌ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డిని బుధవారం సైబరాబాద్‌ పోలీసులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి అతని వద్దను ఆధారాలను పరిశీలించారు.

బెదిరించిన పోలీసులు తెలిసిన వాళ్లే...
ఐటీ గ్రిడ్స్‌ సంస్థ పై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డిని బెదిరించింది ఏపీ పోలీసులేననే ఆధారాలను సైబరాబాద్‌ పోలీసులు సేకరించారు. లోకేశ్వర్‌రెడ్డి ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజీని, ఆయన కాల్‌డేటాను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఇంటికి వచ్చిన వారిలో ఏపీకి చెందిన ఓ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారని సేకరించిన ఆధారాల ద్వారా స్పష్టమైంది. సైబరాబాద్‌ పోలీసులు బుధవారం అమెజాన్‌ సర్వీసుకు 91 సీఆర్‌పీసీ నోటీసులను జారీ చేశారు. మొదటిరోజు నోటీసులు జారీ చేసినా అమెజాన్‌ వెబ్‌ సర్వీసు ఇంకా స్పందించలేదు. దీంతో బుధవారం మరో సారి సైబరాబాద్‌ పోలీసులు 91 సీఆర్‌పీసీ నోటీసును జారీ చేసి దర్యాప్తుకు అవసరం ఉన్న సమాచారాన్ని త్వరగా ఇచ్చేలా అమెజాన్‌ సంస్థ చర్యలు తీసుకోవాలని నోటీసులో స్పష్టంచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement