సంతోష్ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య చైత్ర, తల్లి, బంధువులు, (ఇన్‌సెట్‌లో) హత్యకు గురైన సంతోష్
శివాజీనగర: నగరంలోని జేసీ నగర పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నప్పగార్డెన్ రెండో ప్రధాన రోడ్డు, 11వ క్రాస్ ఓ బేకరి వద్ద బుధవారం అర్ధరాత్రి బీజేపీ యువమోర్చా కార్యకర్త సంతోష్ (28)కు గురయ్యాడు. ఈ హత్యను ఖండిస్తూ గురువారం ఉదయం బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సంతోష్ హత్య సమాచారం అందుకున్న తక్షణమే గురువారం ఉదయాన్నే బీజేపీ నాయకులు మాజీ మంత్రి కట్టాసుబ్రమణ్య నాయుడు నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలు ధరించి చిన్నప్పగార్డెన్‌లో ధర్నా చేపట్టి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చిన్నప్పగార్డెన్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంతోష్ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకురాగా అంబులెన్స్ నుంచి కిందకు దించకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహంచారు.
హోమ్‌శాఖ మంత్రి రామలింగారెడ్డి, నగర పోలీసు కమిషనర్ రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్య నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయనికి ఈ సంఘటన మరో ఉదాహరణ అని అన్నారు. హిందువులకు రక్షణ కరువైందన్నారు. బీజేపీకి చెందిన 26 మంది హిందువులు హత్యకు గురయ్యారని, సంతోష్ హత్యతో 27కు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 4వ తేదీ పరివర్తనా సమావేశం నిమిత్తం ముందస్తుగా గురువారం ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించటంతో ఈ ప్రాంతంలో బీజేపీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న సంతోష్‌ను కాంగ్రెస్ నాయకులు హత్య చేయించారని ఆరోపించారు. తక్షణమే హంతకులను అరెస్టు చేయాలని, కుటుంబానికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
సంతోష్ హత్యకు కాంగ్రెస్ నాయకులే కారణం: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ సంఘాల కార్యకర్తలు అధికంగా హత్యకు గురయ్యారని, ఇందుకు కాంగ్రెస్ నాయకులే కారణమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ... సంతోష్ హత్యతో శుక్రవారం రాష్ట్రస్థాయిలో ధర్నా చేపట్టేందుకు బీజేపీ నిర్ణయించినట్లు తెలిపారు. సంతోష్ కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించటంతో పాటు కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చివరకు పోలీసు కమిషనర్ టీ.సునీల్‌కుమార్ అక్కడకు చేరుకొని బీజేపీ నాయకులతో మాట్లాడి తమ డిమాండ్లను రాష్ట్ర హోమ్‌శాఖ మంత్రి రామలింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సీఎంతో చర్చించి సంతోష్ కుటుంబానికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ప్రకాశ్, బీజేపీ ఎమ్మెల్యే ఏ.వై.నారాయణస్వామి, ఎమ్మెల్సీ అజీమ్, మాజీ ఎమ్మెల్యే నిర్మలా సురానా, నాయకులు సంపత్, గోపి, మాధవ, గణేశ్‌రావు మానె, సీ.ఎస్.సూర్యకాంతరావు,సునీల్, ఏ.జెయిరీమ్, కోదండ, ప్రకాష్ తదితరులు సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నప్పగార్డెన్ ధర్నా నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని పర్యవేక్షించేందుకు బెంగళూరు ఉత్తర డీసీపీ చేతన్ సింగ్ రాథోర్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంటి సమీపంలో బేకరి వద్ద బుధవారం రాత్రి నలుగురు యువకులు సంతోష్‌ను హత్య చేశారని డీసీపీ చేతన్ సింగ్ రాథోర్ తెలిపారు. సమాచారం తెలిసిన తక్షణమే జేసీ నగర పోలీసులు హంతకుల్లో వాసీమ్, పిలిప్స్‌ను అరెస్టు చేశామని, మరో ఇద్దరు హంతకులైన ఉమ్మర్, ఇర్ఫాన్‌ల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
సంతోష్ అంత్యక్రియలు పూర్తి : సంతోష్ అంత్యక్రియలు నగరంలోని కాక్స్‌టౌన్ ప్రాంతంలోని కల్లపల్లిలో గురువారం సాయంత్రం జరిగాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment