‘జాతీయత లేని’ షేర్‌ అలీ కేష్వానీ.. | Arshad Malik case Still Pending in Cherlapally Jail | Sakshi
Sakshi News home page

అటు ఇటు కాకుండా...!

Published Thu, Jun 20 2019 9:29 AM | Last Updated on Thu, Jun 20 2019 9:29 AM

Arshad Malik case Still Pending in Cherlapally Jail - Sakshi

అర్షద్‌ మాలిక్‌ (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: 2004లో కేసు నమోదైంది... 2013లో పీటీ వారెంట్‌పై సిటీకి వచ్చాడు... 2015లో అతడిపై కేసు వీగిపోయింది... అయిననా ఇప్పటికీ చర్లపల్లి కేంద్రం కారాగారంలోనే మగ్గుతున్నాడు... అతడే ‘జాతీయత లేని’ షేర్‌ అలీ కేష్వానీ నేపథ్యం. అతడు పాకిస్థాన్‌ జాతీయుడని ఆరోపించిన పోలీసులు, కాదు భారతీయుడినే అంటూ వాదించిన కేష్వానీ ఇద్దరూ ఆధారాలు చూపించడంలో విఫలం కావడమే ఇందుకు కారణం. ఏడు పదుల వయస్సులో ఉన్న ఇతను అటు పాకిస్థానీ, ఇటు భారతీయుడు కాకపోవడంతో ఏ కేసూ లేకపోయినా నాలుగేళ్లుగా కారాగారంలోనే మగ్గుతున్నాడు. అర్షద్‌ మహమూద్‌ అలియాస్‌ అర్షద్‌ మాలిక్‌ పాకిస్థాన్‌లోని రహీమైఖర్‌ఖాన్‌ జిల్లా ఖాన్‌పూర్‌కు చెందిన వాడు. 2002 నవంబర్‌లో పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఫీర్జీ, లియాఖత్‌లు అతడిని కలిసి తమ తరఫున పని చేయడానికి భారత్‌ వెళ్లాల్సిందిగా కోరారు. అందుకు అర్షద్‌ అంగీకరించడంతో రహీమైఖర్‌ఖాన్‌లో దాదాపు మూడు నెలల పాటు సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాల వినియోగం సహా వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. భారత ఆర్మీ యూనిట్లే టార్గెట్‌గా చేసుకున్న పాకిస్థాన్‌ అధికారులు అర్షద్‌ను పంపాలని నిర్ణయించడంతో శిక్షణ మొత్తం ఆ కోణంలోనే నడిచింది. ఆర్మీలో ఉండే అధికారుల ర్యాంకులు, వారి విధులు, ఆర్మీ యూనిట్లు ఉన్న లొకేషన్లు, కంప్యూటర్‌ ద్వారా మ్యాపుల అధ్యయనం, ఈ–మెయిల్‌ ద్వారా సంప్రదింపులు జరపడం నేర్పారు.

శిక్షణ పూర్తయిన తరవాత పాకిస్థానీ పాస్‌పోర్ట్‌ ఇచ్చి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా పంపారు. అక్కడ అతడిని కలిసిన పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ప్రతినిధులు బంగ్లాదేశ్‌ పాస్‌పోర్ట్‌ ఇచ్చి 2003 మార్చిలో బెహ్‌రామ్‌పూర్‌ మీదుగా కోల్‌కతా పంపారు. కోల్‌కతా, ముంబైలో కొన్ని ప్రాంతాలను పరిశీలించిన అనంతరం అదే ఏడాది మేలో తిరిగి ఢాకా వెళ్లాడు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటూ పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి  2003 జూలైలో ఆదేశాలు అందడంతో అదే ఏడాది ఆగస్టులో భోపాల్‌ మీదుగా కోల్‌కతా చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్‌ చేరుకున్న అతను ముత్యాల్‌బాగ్‌ ప్రాంతంలో ఓ అద్దె గదిలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. వైద్య పరికరాలు అమ్మే చిన్న వ్యాపారినని, కోల్‌కతా నుంచి వచ్చినట్లు చెప్పుకునేవాడు. పగలంతా ఆర్మీ ప్రాంతాల్లో తిరిగి రాత్రి కింగ్‌కోఠి అగర్వాల్‌ ఛాంబర్స్‌లోని హైదరాబాద్‌ సైబర్‌ కేఫ్‌ నుంచి ఈ–మెయిల్స్‌ ద్వారా రక్షణ రహస్యాలను చేరవేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్‌ నుంచి ఫీర్జీ హవాలా ద్వారా ఎప్పటికప్పుడు ఇతనికి సొమ్ము పంపేవాడు. నగరంలో కొరియర్‌ సర్వీసు నిర్వహించే మిలింద్‌ దత్తాత్రేయ ద్వారా పలుమార్లు అర్షద్‌కు వేల రూపాయలు అందేవని పోలీసులు ఆరోపించారు.

2004 మార్చి 9న సైబర్‌ కేఫ్‌లో ఉన్న అర్షద్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్‌ ఫ్లాపీ, కెమెరా, ఆర్మీ లోకేషన్స్‌ ఫొటోలు, సికింద్రాబాద్‌–హైదరాబాద్‌ ప్రాంతాల్లోని ఆర్మీ లోకేషన్స్‌ స్కెచ్‌లు, ఆర్మీ అధికారుల టెలిఫోన్‌ డైరెక్టరీలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతని గదిలో బూట్లలో దాచి ఉంచిన మరో రూ.21 వేలు స్వాధీనం చేసుకున్నారు. అర్షద్‌ ఈ–మెయిల్స్, ఫోన్ల ద్వారా పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో రెగ్యులర్‌ టచ్‌లో ఉండేవాడు. కొన్ని ఈ–మెయిల్‌ కాపీలను సైతం అర్షద్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తొలుత అబిడ్స్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసు అనంతరం  (సిట్‌)కు బదిలీ అయింది. అతడి విచారణ నేపథ్యంలోనే ఈ రహస్యాల చేరవేతలో తనకు షేర్‌ అలీ కేశ్వానీ సహకరించినట్లు చెప్పడంతో అతడిని రెండో నిందితుడిగా చేర్చారు. అయితే అప్పటికే కేశ్వానీని ఆగ్రా పోలీసులు అరెస్టు చేశారు. 2004 జనవరిలో పట్టుబడిన ఇతగాడిపై అక్కడ కేసు విచారణ పూర్తికావడం, జైలు శిక్ష సైతం విధించడంతో సుదీర్ఘకాలం సిటీకి తీసుకురాలేదు. ఐదేళ్ల విచారణ అనంతరం నాంపల్లి కోర్టు మాలిక్‌కు 2009లో జీవితఖైదు విధించింది. మూడో నిందితునిగా ఉన్న కొరియర్‌ సర్వీస్‌ నిర్వాహకుడు, హవాలా ఆరోపణలు ఎదుర్కొన్న మిలింద్‌ దత్తాత్రేయను నిర్ధోషిగా ప్రకటించింది.  ఆగ్రా జైలులో శిక్ష అనుభవిస్తున్న కేశ్వానీని 2013లో సిటీకి తీసుకువచ్చారు.

అతడిపై కోర్టు విచారణ జరిపినప్పటికీ పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేకపోవడంతో 2015 మార్చి 9న కేసు వీగిపోయింది. అర్షద్‌ మాలిక్‌ పాకిస్థానీ కావడంతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన బోగస్‌ పాస్‌పోర్ట్‌తో భారత్‌లోకి వచ్చారు. అరెస్టు సందర్భంలో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇతడు పాస్‌పోర్ట్‌ లేని విదేశీయుడిగా మారిపోయాడు. కేశ్వానీ విషయానికి వస్తే ఇతగాడు పాకిస్థానీ అని ఆరోపించిన పోలీసులు అందుకు ఆధారాలు చూపలేకపోయారు. తాను భారతీయుడినే అంటున్న కేశ్వానీ సైతం ఎలాంటి «ధ్రువీకరణలు సమర్పించలేదు. దీంతో ఇలాంటి వారు శిక్షాకాలం పూర్తయినా, కేసు వీగిపోయినా జైలు నుంచి బయటకు పంపాలంటే ఆయా దేశాలు సదరు వ్యక్తి మా పౌరుడే అని అంగీకరిస్తూ ప్రత్యేకంగా పాస్‌పోర్ట్, వీసా జారీ చేసి తమ ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ కేసులో అర్షద్‌ తమ జాతీయుడేనని అంగీకరించడంతో 2017లో అతడిని పాక్‌కు పంపించేశారు. కేశ్వానీని ఆ దేశం ‘ఓన్‌’ చేసుకోకపోవడంతో ఇప్పటికే చర్లపల్లి జైలులోనే ఉంచారు. ఇదే కేసులో మిగిలిన నిందితులైన బంగ్లాదేశ్, పాకిస్థానీయులు ఫజల్‌ ఉర్‌ రెహమాన్, రజాక్, రషీద్, లియాఖత్, పీర్జీ అలియాస్‌ కరీంభాయ్‌లు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement