
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి చేప చిక్కింది. మల్కాజ్‌గిరిలో ఓ మహిళ నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారి ఫులూ నాయక్ ఏసీబీ అధికారులకు దొరికాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజ్‌గిరి పెన్షన్ కార్యాలయంలో ఫులూ నాయక్ అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓమహిళ తన పెన్షన్ డబ్బులు తీసుకోడానికి కార్యాలయానికి వెళ్లింది. పెన్షన్ డబ్బులు కావాలంటే తనకు కొంత ముట్ట చెప్పాలని ఫులూ నాయక్ ఆమహిళను డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఫులూ నాయక్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.