సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ఓ మైనర్‌ను వేధిస్తున్న సైబర్ పోకిరీపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు అందింది. స్పందించిన అధికారులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేశారు. పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతానికి చెందిన బిలాల్ ఇన్‌స్ట్రాగామ్‌లో మారుపేరుతో ఖాతా తెరిచాడు. దీని ఆధారంగా అనేక మంది యువతులు, బాలికలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేవాడు. దీన్ని యాక్సెప్ట్ చేసిన వారితో తొలినాళ్లలో స్నేహపూర్వకంగానే వ్యవహరించే వాడు. ఆ తర్వాత అసభ్యకర, అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇలా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఎవరైనా బిలాల్‌ను బ్లాక్ చేస్తే.. మరోకొత్త పేరుతో, వేరే ఖాతా తెరిచేవాడు.
ఇలా ఇంతకు ముందు తనను బ్లాక్ చేసిన వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. యాక్సెప్ట్ చేస్తే మళ్లీ వేధింపులు మొదలెట్టేవాడు. ఈ రకంగా బిలాల్ ఇప్పటి వరకు 15 ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలు తెరిచినట్లు తేలింది. బిలాల్ వేధింపులు తారాస్థాయికి చేరడంతో ఇతడిని ఫాలో అవుతున్న వారి లిస్ట్ ఆధారంగా ఒకరితో మరొకరు సంప్రదించుకున్నారు. ఫలితంగా ఇతగాడు అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో వారంతా కలిసి బిలాల్‌ను మందలిస్తూ, ఇదే ధోరణి కొనసాగితే తాము పోలీసులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అయినా అతడి వ్యవహారశైలిలో మార్పు రాలేదు. దీంతో ఇటీవల ఓ బాలిక ఆన్‌లైన్ ద్వారా సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన అధికారులు నిందితుడు బిలాల్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై ఐటీ యాక్ట్‌తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment