సంఘటనాస్థలంలో ఫోరెన్సిక్, బాంబు నిపుణుల తనిఖీలు
సాక్షి, బెంగళూరు: సమయం.. ఆదివారం ఉదయం 9.45 గంటలు.. ప్రాంతం.. బెంగళూరులోని వయ్యాలికావల్ 11వ బీ క్రాస్ రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్న నివాసం వద్ద భారీ విస్ఫోటం.. ఈ సంఘటనలో ఎమ్మెల్యే అనుచరుడు వెంకటేష్ (45) అక్కడికక్కడే మరణించారు. పేలుడుకు మృతదేహం గుర్తుపట్టలేనంతగాచితికిపోయింది. నగరం నడిబొడ్డున పేలుడు జరగడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. మూడు నాలుగు వందల మీటర్ల వరకు పేలుడు శబ్ధం ప్రతిధ్వనించింది. దీంతో జనం ఏం జరిగిందోనని కలవరపాటుకు గురయ్యారు. పేలుడు సంగతి దావానలంలా వ్యాపించడంతో ఘటనాస్థలికి తరలివచ్చారు. ఎమ్మెల్యేకు ఉన్న పలు నివాస భవనాల్లో ఇది కూడా ఒకటి. పేలుడు తీవ్రతకు గోడలకు పగుళ్లు వచ్చాయి.
ముమ్మరంగా పరిశోధన
సంఘటన స్థలంలో బాంబు స్క్వాడ్ బృందం, జాగిలాలను వెంటనే పిలిపించి పరిశీలించారు. న గర పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే పేలుడుకు కారణాలు తెలిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఎవరు సంచరించకుండా గట్టి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ సిబ్బంది పేలుడు శకలాలను, మృతదేహం నమూనాలను సేకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ ముమ్మరంగా శోధించింది.
సంఘటనాస్థలంలో ఫోరెన్సిక్, బాంబు నిపుణుల తనిఖీలు
భారీశబ్ధం, జనం భయభ్రాంతులు
పేలుడుతో ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాలైన మల్లేశ్వరం, వయ్యలికావల్, ఇతరత్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. పరిసర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అసలు పేలుడు వెనుక కారణాలు ఏంటో తెలియక తికమకపడ్డారు. వెంకటేశ్ వృత్తిరీత్యా ఒక ధోబీ– టైలర్ అని సమాచారం. ఆయనకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి వయ్యాలికావల్‌లో ఉంటున్న వెంకటేశ్‌కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన కొత్త ఇల్లు కట్టే ప్రయత్నాలు ఉండేవారు. ఎమ్మెల్యే మునిరత్నకు వెంకటేష్ ఒక బాల్య స్నేహితుడు కావడం గమనార్హం.
ఎమ్మెల్యే విచారం
ఎమ్మెల్యే మునిరత్న మాట్లాడుతూ ఎవరూ ఎలాంటి ఊహాగానాలను, పుకార్లను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వెంకటేష్ మరణం తననెంతో కలచి వేసిందన్నారు. వెంకటేష్, తాను కలసి చిన్నతనంలో ఆడుకునేవారమని చెప్పారు.
ఏమిటీ కారణం
పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటిని నిర్మాణ పనిలో వెంకటేశ్ ఉన్నాడు. ఆదివారం ఉదయం కొత్త ఇంటికి అమర్చే కిటికీలు, తలుపులు, తదితర వస్తువులను పరిశీలించేందుకు వచ్చిన వెంకటేశ్ పేలుడుకు బలయ్యారు. ఎమ్మెల్యే నివాసం ఎదురుగా సుమారు 400 చ.అ ఖాళీ స్థలం ఉంది.అందులో కొత్త కట్టడానికి సంబంధించిన సామగ్రి ఉంది. ప్లాస్టిక్ మౌల్డింగ్ కోసం వినియోగించే ఉద్ధేశంతో తీసుకొచ్చిన కొన్ని రసాయనాల వల్ల పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రసాయనాల డబ్బాలను తెరిచే ప్రయత్నంలో పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రసాయనాలను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని సరఫరా చేసిన వ్యక్తిని విచారిస్తామని చెప్పారు. లేక నిజంగా బాంబులే పేలాయా? అన్నది విచారణలో తెలుస్తుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment