
నిందితుల అరెస్టు చూపుతున్న సీపీ
కరీంనగర్ క్రైం : కొన్నేళ్లుగా నల్లని నోట్లు అంటగడుతూ.. వాటిని రంగుద్రావకంలో వేస్తే చెల్లుబాటు అవుతాయని నమ్మించి మోసం చేస్తున్న ముఠాను కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సురేష్‌నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఘని అలియాస్ షాకిర్ (47), తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన గువ్వల ప్రకాశ్ అలియాస్ నాని(37) ముఠాగా ఏర్పడ్డారు.
నల్లని రంగు షీట్లను రూ. 2000, రూ.500 నోట్ల పరిమాణంలో కట్‌చేసుకుని బండిల్స్‌గా మార్చి.. వాటిలో మధ్య అక్కడక్కడా ఒరిజినల్‌నోట్‌కు అయోడిన్ ద్రావణాన్ని పూస్తున్నారు. అసలైన నోట్లకు నల్లరంగు పూసి వాటి మధ్య పెడుతున్నారు. తమ వద్ద నల్లని రంగు కాగితాలను కరెన్సీనోట్లుగా మార్చే ద్రావకం, పేపర్లు ఉన్నాయని చెప్పి.. వాటిని చూపిస్తున్నారు. నమ్మించేందుకు ముందే పెట్టుకున్న అసలైననోటు తీసి.. ఫొటోప్రేమ్‌లు కడగడానికి వినియోగించే ఐపో ద్రావకంలో కడుగుతున్నారు. ఇలా బాధితులను నమ్మించి లక్ష నిజమైన కరెన్సీ ఇస్తే.. రూ.మూడు లక్షల నల్లని కరెన్సీ, ద్రావకం ఇస్తామని మోసగిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు వందలాది మందిని మోసం చేసినట్లు సమాచారం.
చిక్కింది ఇలా..
మానకొండూరుకు చెందిన అమ్మిశెట్టి రవి నుంచి రూ.75 వేలు తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తన మిత్రుడు సంపత్‌కు చెప్పాడు. అతడు నిందితులకు రూ.4.65 లక్షల వరకు ఇచ్చాడు. దీంతో నిందితులు సంపత్‌ను సామర్లకోటకు పిలిపించుకుని రూ.20 లక్షలంటూ.. నల్లనినోట్లు, ద్రావకం ఇచ్చారు. తిరిగి వస్తుండగా.. ద్రావకమున్న బాటిల్ పగిలిపోయింది. విషయాన్ని నిందితులకు చెప్పడంతో వారు మరో రూ.రెండు లక్షలు డిమాండ్ చేశారు. అవి ఇచ్చి.. ద్రావకంతో ఇక్కడికొచ్చాక పరిశీలిస్తే.. నిజం నోట్లు కావని తేలింది.
నిందితుల కోసం గాలించినా.. వారి ఆచూకీ లభించలేదు. దీంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీఐ శ్రీనివాసరావు, ప్రత్యేక బృందం కలసి నిందితులు షాకిర్, గువ్వల ప్రకాశ్‌ను పట్టుకున్నారు. వారిని విచారించగా ఎంతోమందిని మోసం చేశామని ఒప్పుకున్నారని సీపీ తెలిపారు. నిందితులను అరెస్టుచేసి వారి నుంచి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, మెసానికి వినియోగించే నల్లని నోట్లు, ద్రావకం, బ్యాంక్ అకౌంట్లు, 70కి పైగా ఏటీఎం కార్డులు, 15 నకిలీ బంగారు బిళ్లలు, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు, సీఐ మాధవి, మానకొండురు సీఐ కోటేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించి నగదు రివార్డులు అందించారు.

స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు
Comments
Please login to add a commentAdd a comment