కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు
వేపాడ: కన్నపేగు తెంచుకుని పుట్టిన కొడుకు వృద్ధాప్యంలో పోషిస్తాడని ఊహించుకున్న ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తూ ఆ బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఉన్న ఇద్దరిలో ఒకరినైనా చదివించి ప్రయోజకుడ్ని చేద్దామని కష్టపడి పనిచేస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశల్ని విధి ఎత్తుకుపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న కొడుకు కళ్ల ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఎడుస్తుంటే వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు. క్షణికావేశంలో ఆ బాలుడు తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దహించేస్తుంటే, ఊరిని శోకసంద్రంలో ముంచేసింది. ఈ మృతిపై వల్లంపూడిగ ఎస్‌ఐ స్వర్ణలత అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వేపాడ మండలం ముకుందపురం గ్రామానికి చెందిన ఏడువాక గణేష్ (13) సోమవారం తన ఇంటిలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే తండ్రి రామకృష్ణ, అన్నయ్య హరికృష్ణతో కల్లానికి వెళ్లి పాలు తీసుకువచ్చి, గ్రామంలోని క్యాన్‌కు పాలు పోసిన తర్వాత గణేష్ ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో తల్లి దేముడమ్మ గణేష్‌ను బడికి టైము అవుతుంది వెళ్లవా అని అడిగింది. మక్క నొప్పి పెడుతుందని వెళ్లనని సమాధానం ఇచ్చాడు. తల్లి పనుల్లో మునిగిపోయింది. అనంతరం గణేష్ అన్న హరికృష్ణ వచ్చి తమ్ముడు స్కూల్‌కు వెళ్లలేదా అని తల్లిని అడిగాడు. వెళ్లలేదని ఆమె చెప్పింది. వెంటనే హరికృష్ణ, గణేష్ ఉండే రూములోకి వెళ్లి చూడగా తమ్ముడు హుక్కుకు ఉరివేసుకుని ఉండడాన్ని చూసి హతాశుడయ్యాడు. వెంటనే హరికృష్ణ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి గణేష్‌ను కిందకి దింపాడు. అప్పటికే గణేష్ మృతి చెందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment