బీ'టెక్‌' చైన్‌ స్నాచర్‌ అరెస్టు | Btech Chain Snatcher Arrest | Sakshi
Sakshi News home page

బీ'టెక్‌' చైన్‌ స్నాచర్‌ అరెస్టు

Published Fri, Mar 9 2018 9:28 AM | Last Updated on Fri, Mar 9 2018 9:28 AM

Btech Chain Snatcher Arrest - Sakshi

దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు నగలు ,పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కంప ఈశ్వర్‌కిశోర్‌

అతను ఉన్నత చదువు చదివాడు. మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన సమయంలో అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం చోరీలు చేయడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు.

తిరుపతి క్రైం : బీటెక్‌ చదివి చైన్‌ స్నాచింగులకు పాల్పడుతున్న దొంగను అర్బన్‌ జిల్లా క్రైం పోలీసులు బుధవారం సాయంత్రం తనపల్లిలోని మార్కెట్‌ యార్డు వద్ద అరెస్టు చేశారు. క్రైం పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. తిరుచానూరులోని కొత్తపాలెం లేఔట్‌లో నివాసముంటున్న కాటయ్య కుమారుడు కంపా ఈశ్వర్‌కిశోర్‌ (29) 2010లో బీటెక్‌లో ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం పలు పరీక్షలు రాశాడు. ఇందుకోసం తిరుపతి నగరంతోపాటు నంద్యాలలోని కోచింగ్‌ సెంటర్లలో కోచింగ్‌ తీసుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతోపాటు జల్సాలకు అలవాటుపడి తిరుపతికి చేరుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మొదట బ్యాగుల దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. అలా వచ్చిన డబ్బులు తీసుకుని నంద్యాలకు వెళ్లిపోయాడు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో తప్పించుకుని తిరిగాడు.

మళ్లీ తిరుపతికి చేరుకుని..
2013 నుంచి 2015 వరకు తిరుపతిలో ఉంటూ ఉద్యోగాల కోసం ముమ్మరంగా ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో డబ్బు అవసరాల కోసం తిరిగి చైన్‌ స్నాచింగ్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు. తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలను గుర్తించి తన ద్విచక్ర వాహనంలో వెళుతూ చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు జల్సాలకు అలవాటు పడిన ఈశ్వర్‌ కిశోరే చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతనిపై తిరుపతి క్రైం పోలీసు స్టేషన్‌లో 7, ఎంఆర్‌పల్లి పోలీసు స్టేషన్‌లో 7, ఎస్వీయూ పోలీసు స్టేషన్‌లో 2, శ్రీకాళహస్తి టూటౌన్‌లో ఒకటి, తిరుచానూరులో 2 మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. నిందితుడు ఈశ్వర్‌ కిశోర్‌ నగలను అమ్మి వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చేవాడు. ఈ నెల 7న స్నేహితులు డబ్బు కావాలని అడగడంతో తన వద్ద ఉన్న బంగారు నగలు అమ్మేందుకు బయలుదేరాడు. సమాచారం అందుకున్న క్రైం సీఐ మధు చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.13.40 లక్షలు విలువ చేసే 383 గ్రాముల బంగారు ఆభరణాలు, 422 గ్రాముల వెండి, రూ.1.70 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇదే మొదటి సారి
డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నిందితుడు ఈశ్వర్‌కిశోర్‌ ఇన్ని దొంగతనాలకు పాల్పడ్డా ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదన్నారు. 2017లో జరిగిన 16 చోరీలపై బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సీఐలు అబ్బన్న, శరత్‌చంద్ర, భాస్కర్‌రెడ్డి, పద్మలత, ఎస్‌ఐలు రమేష్‌బాబు, సిబ్బంది ఎంతగానో కృషి చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా క్రైం పార్టీ ఇన్‌చార్జి అబ్బన్న, ఎస్‌ఐ రమేష్‌బాబు, ఐడీ పార్టీ సిబ్బంది కీలకంగా వ్యవహరించారని, వీరందరికీ అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మొహంతి ద్వారా రివార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో కష్టపడిన సిబ్బంది స్వయం ప్రకాష్, రవిప్రకాష్, గౌరినాయుడులను ప్రత్యేకంగా అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement