బుసలు కొడుతున్న  కట్టల పాములు | Capture of cash Across the state | Sakshi
Sakshi News home page

బుసలు కొడుతున్న  కట్టల పాములు

Published Tue, Apr 9 2019 5:56 AM | Last Updated on Tue, Apr 9 2019 5:56 AM

Capture of cash Across the state - Sakshi

గుంటూరులోని అరండల్‌పేటలో రవికిరణ్‌ ఇంట్లో పట్టుబడ్డ రూ. 40 లక్షల నగదు

సాక్షి నెట్‌వర్క్‌:  ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ నేతలు పూర్తిగా బరితెగించారు. విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో పంపిణీకి సిద్ధంగా ఉన్న టీడీపీ నేతలకు చెందిన రూ.40 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. ‘సాక్షి’  ప్రతినిధులు ఇచ్చిన సమాచారం మేరకు గుంటూరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జ్‌ అగస్టిన్‌ పాల్, అరండల్‌పేట సీఐ బ్రహ్మయ్య తమ బృందాలతో అరండల్‌పేటలోని ఐస్‌క్రీం షాప్‌ యజమాని దేవరపు రవికిరణ్‌ ఇంట్లో నిల్వ ఉంచిన నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అప్రమత్తమైన రవికిరణ్‌ రెండు బ్యాగుల్లో రూ.30 లక్షలకు పైగా నగదును వేరే ప్రాంతానికి తరలించాడు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు సంబంధించినదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవికిరణ్‌ ఇంట్లో నగదు ఎవరెవరిదగ్గర నుంచి సేకరించారు.. ఎవరెవరికి పంపించాలి అనే వివరాలతో కూడిన నోట్‌బుక్‌ను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్‌బుక్‌లో రూ.77.70 లక్షలకు గాను రూ.43.46 లక్షలు టీడీపీకి చెందిన చిట్టిబాబు, గోపి, మాధవ్, నాగేశ్వరరావు, నాగరాజు, విజయ్, ప్రసాద్, వాసులకు  చేరవేసినట్లుగా రాసుకున్నారు. చిట్టిబాబు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ప్రధాన అనుచరుడు. 

టీడీపీ నాయకులకు రూ. 43.46 లక్షలు చెల్లించినట్లు నోట్‌ బుక్‌లో రాసుకున్న రవికిరణ్‌ 

తప్పించే ప్రయత్నాల్లో పోలీసులు 
రవికిరణ్‌ నివాసంలో టీడీపీ నాయకుల పేర్లతో కూడిన నోట్‌ పుస్తకం, రూ.40 లక్షల నగదు పట్టుబడ్డాయి. నగదు పట్టుబడిన సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి రవికిరణ్‌ను రక్షించే పనిలో పడ్డారని తెలుస్తోంది. దీంతో పోలీసులు సైతం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లకు డబ్బు పంచేందుకు పలువురు టీడీపీ నేతలకు డబ్బులు చేర్చినట్లు నోట్‌ పుస్తకంలో వివరాలు ఉండటంతో వారిపై పోలీసులతో పాటు ఐటీ అధికారులు దృష్టి సారించారు. 

రాప్తాడులో రూ.2.25 లక్షలు పట్టివేత
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ తరఫున ఆ  పార్టీ నాయకులు రాత్రిపూట గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం వేపకుంట సమీపంలో టీడీపీ నాయకులు తమ వాహనాల్లో తరలిస్తున్న రూ.2.25 లక్షల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

భీమవరంలో రూ.26 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూటౌన్‌ పోలీసులు సోమవారం స్థానిక అడ్డవంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.26 లక్షలు నగదు పట్టుబడ్డాయి. ఎంవీవీ ముసలయ్య అనే వ్యక్తి మోటార్‌ సైకిల్‌పై ఈ నగదును తీసుకు వెళుతుండగా తనిఖీల్లో దొరికింది.  

4800 చీరలు సిద్ధం చేసిన టీడీపీ నేతలు!
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు గుంటూరు రూరల్‌ మండలంలో టీడీపీ నేతలు సిద్ధం చేసిన 4800 చీరలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని ఓ గదిలో చీరలు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జ్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం  దాడిచేసి  వాటిని స్వాధీనం చేసుకుంది. అయితే టీడీపీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా కేసు నుంచి తప్పించుకునేందుకు అవి తమవి కాదని చెబుతున్నారని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.

కారులో తరలిస్తున్న రూ.49 లక్షలు సీజ్‌ 
సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బ్యాంక్‌ సొమ్ము రూ.49 లక్షలు సోమవారం విశాఖ జిల్లా సబ్బవరం పోలీసులు సీజ్‌ చేశారు. సబ్బవరం మండలం గుల్లేపల్లి జంక్షన్‌ వద్ద వాహనాల్లో సోదాలు నిర్వహించగా ఒక  కారులో రూ.49 లక్షలు పట్టుకున్నారు. కారులో ఉన్నవారిని ప్రశ్నించగా విశాఖ యూకో బ్యాంక్‌ నుండి దేవరాపల్లి యూకో బ్యాంక్‌ శాఖకు తరలిస్తున్నట్లు అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ అఫీసర్‌ డి నాగమల్లిక తెలిపారు. నగదు ట్రాన్స్‌ఫర్‌ లెటర్‌ సైతం చూపించారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు రిటర్నింగ్‌ అధికారి అనుమతిపత్రం లేనందున నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఎస్‌టి టీమ్‌ ఇన్‌చార్జ్‌ బాబురావు తెలిపారు.  

నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ప్రలోభాల వల
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు భారీ ఎత్తున నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. కొన్నిచోట్ల ముందస్తు సమాచారంతో పోలీసులు వారిని పట్టుకుంటున్నారు. సోమవారం రూ.12 లక్షలకు పైగా నగదు, 1500కు పైగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో ఆదివారం రాత్రి ఎస్సీలపై దాడి చేసిన ఘటన మరువకముందే  ఓట్లకు డబ్బులు తీసుకోలేదన్న అక్కసుతో టీడీపీ నాయకులు ఎస్టీలపై దౌర్జన్యానికి దిగారు. సోమవారం రాత్రి కాలనీలో ఓట్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు టీడీపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మాకు ఎలాంటి నగదు వద్దు, మాకు నచ్చిన పార్టీకి ఓట్లు వేస్తామని కాలనీ వాసులు చెప్పగా, వచ్చిన వ్యక్తులు తిరిగి వెళ్లి, స్థానిక టీడీపీ నాయకులకు చెప్పారు. దాంతో సుమారు 100 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాలనీకి చేరుకొని ఓట్లకు డబ్బులు తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. కాలనీ వాసులు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఎïస్టీలను కులం పేరుతో తిడుతూ నానా దుర్భాషలాడారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలపై భౌతిక దాడులకు దిగారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భీమవరంలో ఓటర్లకు జనసేన ఎర
భీమవరంలో ఎన్నికల ప్రచారంలో వెనుకబడ్డ జనసేన అధినేత పవన్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు పంపిణీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటుకు రూ.1000  చొప్పున సోమవారం నుంచి పంపకం మొదలుపెట్టారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తామేమి తక్కువ తినలేదన్నట్లు ఓటుకు రూ.2 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ లేకపోవడం వల్లే ఓటర్లను ఆకట్టుకోడానికి డబ్బు పంపిణీ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement