
సాక్షి, మచిలీపట్నం/ పెడన : ‘విజయవాడ పార్లమెంట్ పరిధిలోని సీపీఐ నాయకులు సరైన వారు కాదు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర నేతల దృష్టికి తీసుకెళ్లా. అయినా మార్పు లేదు. దీంతో అక్కడ జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిని బరిలోకి దించుతున్నాం. మీరు పొత్తు నుంచి వైదొలుగుతానంటే అది మీ నిర్ణయం.’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బందరు, పెడన, అవనిగడ్డలలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. తాను పొత్తు ధర్మాన్ని పాటిస్తానని, సీపీఐ నాయకులు అర్థం చేసుకుని తనతో నడవాలన్నారు. సభ ముగిసే సమయంలో సైతం.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న పవన్, సీపీఐ కూడా కలిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ సీపీ లక్ష్యంగానే ప్రసంగం
జనసేన అధినేత ప్రసంగం ఆసాంతం వైఎస్సార్ సీపీని విమర్శించడమే లక్ష్యంగా సాగింది. మధ్యమధ్యలో టీడీపీ నాయకుల అవినీతి కాసేపు ప్రస్తావనకు తీసుకురావడం, తిరిగి వైఎస్సార్ సీపీ, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. బందరు పోర్టు నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు భూ దోపిడీకి పాల్పడుతున్నారని, 30 వేల ఎకరాలను తీసుకోవాలనుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. మచిలీపట్నం, పెడన పట్టణాలను జంట నగరాలను చేస్తామని, రైతులకు, మత్స్యకారులకు రూ.5వేలు పింఛను అందజేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
పెడన బస్టాండు వద్ద జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ ఆడపడుచులకు ఆదాయపరిమితితో సంబంధం లేకుండా చిన్న కుటుంబానికి ఆరు సిలెండర్లు, పెద్ద కుటుంబానికి పది సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తాను సీఎం అయితే మూడు లక్షలు ఉద్యోగాలను ఇస్తామని, బ్యాక్‌లాగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తానన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 25వేల మంది యువకులను 18 సంవత్సరాలు నిండగానే స్పెషల్ కమాండో పోలీస్ ఫోర్సులోకి తీసుకుంటామన్నారు. కాగా సభలకు సీపీఐ నాయకులు దూరంగా ఉన్నారు.