
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మంక్రైం : వేలి ముద్రలు.. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పట్టించాయి. తొమ్మిదిన్నర లక్షల రూపాయల విలువైన 28 తులాల బంగారాన్ని స్వాధీనపర్చుకున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించిన వివరాలు... గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన పెండ్ర పెద్ద వెంకటేశ్వర్లు కూలి పని చేస్తూనే దొంగతనాలకు అలవాటుపడ్డాడు.
ఇతనిపై 30 చోరీ కేసులు, ఒక హత్య కేసు ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఉప్పు తిరుపతిరావు, ఆరు చోరీ కేసుల్లో నిందితుడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నల్లమోతుల సురేష్ అలియాస్ యర్రోడు, 50 చోరీ కేసులలో నిందితుడు. వీరు ముగ్గురూ జైలులో స్నేహితులుగా మారారు. బయటకు వచ్చిన తరువాత ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం రూరల్, ఖమ్మం, వైరా సబ్ డివిజన్లలో దొంగతనాలు చేయసాగారు.
వీరు మొదట రెక్కీ చేసిన తరువాత చోరీలు చేస్తుంటారు. పట్టపగలు చోరీలు చేయడంలో వీరు దిట్ట. ఖమ్మం రూరల్, వైరా, ముదిగొండ, ఖానాపురం హవేలి, ఖమ్మంటూటౌన్, కామేపల్లి, ఏన్కూరు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశారు.
ఇలా చిక్కారు..
వరుస చోరీలకు పాల్పడుతున్న వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా చిక్కడం లేదు. ఖమ్మం అడిషనల్ డీసీపీ కొల్లు సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో సీసీఎస్ ఏసీపీ ఈశ్వరయ్య, సీఐ కరుణాకర్.. వీరు చేస్తున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఫింగర్ ప్రింట్ విధానంపై అత్యాధునిక టెక్నాలజీని ఇటీవల తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించింది. దాని ద్వారా ఈ దొంగల వివరాలు బయటపడ్డాయి.
దీంతో ఇక్కడి నుంచి సీసీఎస్ ప్రత్యేక బృందం విజయవాడకు వెళ్లింది. అక్కడ ఈ దొంగల ఆచూకీ దొరకలేదు. వారి స్వగ్రామాలలో సైతం పోలీసులు వెతికారు. అనంతరం, వీరిని ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ చేసిన 28 తులాల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ తొమ్మిదిన్నర లక్షల రూపాయలు.
వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దొంగల భరతం పట్టిన అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్, ఏసీపీ ఈశ్వరయ్య, సీసీఎస్ సీఐ కరుణాకర్ బృందాన్ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో ఖమ్మం ఏసీపీ వెంకట్రావు, సీసీఎస్ ఎస్సై ఆనందరావు, సిబ్బంది లింగయ్య, డానియెల్, శ్రీను, రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment