ఔటర్‌పై కారు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం | Car Catches Fire At ORR Patancheru | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై కారు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం

Feb 20 2019 1:04 PM | Updated on Feb 21 2019 4:06 AM

Car Catches Fire At ORR Patancheru - Sakshi

రింగ్‌ రోడ్డుపై కారు నుంచి ఒక్కసారిగా వచ్చిన మంటలు , గంటా వెంకటగిరి(ఫైల్‌)

పటాన్‌చెరు టౌన్‌: కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. అమీన్‌పూర్‌ సీఐ ప్రభాకర్, అసిస్టెంట్‌ జిల్లా ఫైర్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి కథనం ప్రకారం..బుధవారం ఉద యం 11.10 గంటల సమయంలో మేడ్చల్‌ నుంచి ముత్తంగి వైపు వెళ్తున్న కారు (టీఎస్‌ 07 జీఎం 4666) సుల్తాన్‌పూర్‌ సమీపంలోకి రాగానే మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు కారు డోర్‌ తీసేం దుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. ఇంజన్‌ నుంచి మంటలు ఎగిసిపడి డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది. అప్పటికే కారులో ఉన్న వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు. కారు మియాపూర్, జేపీనగర్‌ క్రాస్‌ రోడ్డుకు చెందిన గంట శ్రీదేవి పేరుతో రిజిస్ట్రేషన్‌ అయినట్లు తెలిసింది. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని హైదరాబాద్‌ బోరంపేట్‌కు చెందిన గంటా వెంకటగిరి (48)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఎరుకతో ఉంటే మేలు!  
హైదరాబాద్‌ శివార్లలో తరచూ కార్లు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రాణనష్టం లేకపోయినా ఆస్తినష్టం మాత్రం భారీగా ఉంటోంది. ఇలాంటి అగ్నిప్రమాదాలకు అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించొచ్చని సూచిస్తున్నారు.

వైర్లపై కన్నేయాలి
కార్లలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు 70 శాతం వాటి లో వినియోగిస్తున్న వైర్లే కారణమవుతున్నాయి. వీటికి అతుకులు ఉండటం, నిర్వహణ మరిచిపోవడంతో నిప్పు రవ్వలు చెలరేగి ప్రమాదాలకు కారణమవుతోంది. బ్యాట రీకి ఉండే వైర్ల ద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. ఇటీవల కాలంలో కార్లలో తక్కువ మందం ఉన్న వైర్లను వినియోగించడం ప్రమాదాలకు కారణమవుతోంది.

బ్యాటరీలను మరవొద్దు
కార్లలోని బ్యాటరీలను యజమానులు సరిగ్గా పట్టించుకోకపోవడం కూడా అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. బ్యాటరీల్లో హైడ్రోజన్, ఎలక్ట్రోలైట్‌ సంబంధిత పదార్థాలు ఉంటాయి. ఇవి తరచూ బయటికొచ్చి బ్యాటరీలపై పేరుకుపోతాయి. దీంతో విద్యుత్‌ సరఫరా సరిగ్గా లేకపోవడంతో పాటు నిప్పు రవ్వలు చెలరేగడానికి ఆస్కారం ఉంటుంది.

ఇంజన్‌ను పరిశీలించాలి..
కార్లలో ఉండేది ఇన్నర్‌ కంప్రెషన్‌ ఇంజన్‌. అంటే దాని లోపలి ప్రాంతంలో పెట్రోల్, డీజిల్‌ మండటంతో వెలువడే శక్తి ద్వారా అది పని చేస్తుంది. ఆ ప్రాంతంలో ఉండే సీలింగ్స్, గ్యాస్‌ కిట్స్‌ను సరిగ్గా బిగించుకోవాలి. వీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. లేకపోతే ఇంధనం లీక్‌ కావడం, నిప్పు రవ్వలు చెలరేగి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది.

కూలెంట్‌ సైతం కీలకమే
ఇటీవల వస్తున్న కార్లకు రేడియేటర్లు ఉండట్లేదు. ఇవి ఉంటే వాటిలో నీరు నిండుకోగానే పొగలు వచ్చి కార్లు ఆగిపోయేవి. ఇప్పుడు దీనికి బదులు కూలెంట్‌ ఆయిల్‌ వినియోగిస్తున్నారు. ఇది ఇంజన్‌ చుట్టూ తిరిగి దాన్ని చల్ల్లబరుస్తుంది. దీనిపై నిర్లక్ష్యం వహిస్తే మంటలు వచ్చే ప్రమాదముంది. కూలెంట్‌ ఆయిల్‌ నాణ్యత కోల్పోయినప్పుడు మార్చకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

గ్యాస్‌ కిట్లతోనూ కష్టమే
పెట్రోల్, డీజిల్‌కు బదులు సీఎన్‌జీ, ఆటో ఎల్పీజీలతో నడిచే వాహనాలొచ్చాయి. తక్కువ ఖర్చనే ఉద్దేశంతో కొన్ని పాత వాహనాలనూ కన్వర్షన్‌ చేయడం ద్వారా గ్యాస్‌ను ఇంధనంగా వాడుతున్నారు. ఈ గ్యాస్‌ కిట్లతో పాటు వీటిని వాడే పైప్‌ కూడా నాణ్యమైన, ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్నవే వాడాలి. ఏమాత్రం నాణ్యతా లోపమున్నా ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement