బీటెక్ విద్యార్ది శ్రీ హర్ష
కర్ణాటక,బనశంకరి: నగర శివార్లలో సర్జాపుర రోడ్డులో కసవనహళ్లి అమృత ఇంజనీరింగ్ కాలేజీ 7వ అంతస్తు పై నుంచి దూకి సోమవారం ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్ది శ్రీ హర్ష కేసులో కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు 10 మందిపై పరప్పన అగ్రహార పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన శ్రీహర్ష (20)ను కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురిచేసిందని ఆయన తండ్రి విజయ్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అమృత ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ధనరాజ్‌స్వామి, అధ్యాపకులైన ఎస్‌జీ.రాజేశ్, బీఎల్.భాస్కర్, రవికుమార్, కేటీ.రమేశ్, నిపుణ్ కుమార్, అముద, బీ.వెంకటేశ్, ఎస్‌ఆర్.నాగరాజ, ఎన్‌ఎస్.మూర్తిపై కేసు నమోదు చేశారు.
ఆత్మహత్యకు ప్రేరేపించడం, సాక్ష్యాలు నాశనం చేశారని అభియోగాలు నమోదు చేశారు. కాలేజీ హాస్టల్‌లో సౌకర్యాల కొరతపై ప్రశ్నించినందుకు తమను వేధిస్తున్నారని, అది తట్టుకోలేక శ్రీ హర్ష ప్రాణాలు తీసుకున్నాడని సహచర విద్యార్థులు ఆరోపించారు. ఈ కేసులో విద్యార్థుల, సిబ్బంది నుంచి సమాచారం సేకరిస్తున్నామని, సాక్ష్యాధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆగ్నేయవిభాగం డీసీపీ ఇషా పంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment