
నేతల నాగేంద్రకుమార్ ,పసల శ్రీను
అమలాపురం టౌన్: రోడ్డుపై నడుచుకుంటూ ఖరీదైన సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్లే మహిళలే వారి టార్గెట్. వారిని ఆటోలో వెంబడించి.. వారికి పక్క నుంచి వెళ్లి సెల్‌ఫోన్‌లను లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి పరారవ్వడం వారి నైజం.. గత నెల 30వ తేదీ సాయంత్రం అమలాపురం మెయిన్ రోడ్డులోనే ఓ మహిళ నుంచి సెల్‌ఫోన్ లాక్కొని ఆటోలో పరారైన రాజమహేంద్రవరం సమీపంలోని మోరంపూడికి చెందిన నేతల నాగేంద్రకుమార్, పెసల శ్రీను అనే 20 ఏళ్ల యువకులను ఆ మర్నాడు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్‌లో కూడా పది రోజుల క్రితం ఇదే తరహాలో వీరు సెల్‌ఫోన్లు చోరీ చేశారు. అమలాపురం పోలీసులకు వీరు దొరకడంతో అక్కడి పోలీసులు కూడా వీరిద్దరినీ విచారించనున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు బుధవారం వెల్లడించారు. ఆయన కతనం ప్రకారం.. పట్టణంలోని నారాయణపేటకు చెందిన ఓ ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని ఎం.అనురాధ ఈనెల 30వ తేదీ సాయంత్రం బస్ స్టేషన్‌లో దిగి నడుచుకుంటూ వస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. రాజమహేంద్రవరం నుంచి పలు బస్‌స్టేషన్లకు వెళ్లి వస్తున్న ఆ యువకులు అమలాపురం బస్ స్టేషన్ వద్ద మాటువేసి ఆ తరహా నేరానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈదరపల్లి – ముక్కామల బైపాస్ రోడ్డులో ఆటోతో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను పట్టణ ఎస్సై జి.సురేంద్ర, హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు, కానిస్టేబుల్ చిట్నీడి రమేష్ పట్టుకున్నారు. వారిని విచారించగా ముందు రోజు మహిళ నుంచి కాజేసిన ఖరీదైన సెలఫోన్‌ను ఎవరికైనా అమ్మి సొమ్ములు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నాగేంద్రకుమార్, శ్రీనుల నుంచి దొంగిలించిన సెల్‌ఫోన్, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment