బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చంద్రముఖి
బంజారాహిల్స్: గోషామహల్ బీఎల్‌ఎఫ్ అభ్యర్ధి, ట్రాన్స్‌జెండర్ ఎం.రాజేష్ అలియాస్ చంద్రముఖి(32) అదృశ్యంపై మిస్టరీ వీడింది. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చంద్రముఖి బుధవారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. తన కూతురు కనిపించడం లేదని చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్‌కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో బుధవారం పోలీసులకు చెమటలు పట్టాయి. ఏమాత్రం ఆచూకి లేని చంద్రముఖిని గురువారం ఉదయంలోగా హైకోర్టులో ఎలా ప్రవేశపెట్టాలో తెలియక సతమతమయ్యారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి తెలుగు రాష్ట్రాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు రాత్రి 11 గంటల ప్రాంతంలో చంద్రముఖి సికింద్రాబాద్‌లోని లంబా థియేటర్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆమె సన్నిహితులను అప్రమత్తం చేసిన పోలీసులు ఆమెను స్టేషన్‌కు రప్పించడంతో కథ సఖాంతమైంది.
గురువారం ఉదయం ఆమెను హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అంతకుముందు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆ రోజు ఉదయం 8 గంటలకు రూ.25వేలు బ్యాంకులో జమ చేసేందుకు వెళుతుండగా సందులో ఓ ఆటో ఎక్కడం జరిగిందన్నారు. ఆ ఆటోవాల తనను కోఠిలోని ఓ వీధిలోకి తీసుకెళ్లాడని అక్కడ మరో ఆటో ఎక్కి ఎల్బీనగర్‌లో దిగానన్నారు. అక్కడ బస్సు ఎక్కి విజయవాడలో, అక్కడి నుంచి తిరుపతి, అక్కడి నుంచి చెన్నై వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా ఎవరో తనను చేతబడి చేసి ముందుకు నడిపించినట్లుగా ఉందని, మత్తులో ఉండి తాను ఎటు వెళ్తున్నానో, ఏ బస్సు ఎక్కుతున్నానో తెలియలేదన్నారు.
కోఠిలో ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించారని, మరోసారి చూస్తే వారిని గుర్తుపడతానన్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. తన అజ్ఞాతం వెనుక, తనను చేతబడి చేయడం వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. అయితే ఆటోలో ఎక్కడం, బస్సులు ఎక్కడం అన్ని ప్రాంతాలు తిరగడం ఎలా సాధ్యమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె చెప్పే విషయాలపై పొంతన లేదని వారు పేర్కొన్నారు. ఏదైతేనేం చంద్రముఖి కనిపించడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. దీని వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment