సాక్షి, పంజగుట్ట: వారు ఉన్నత విద్యావంతులు. ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఆర్థిక ఇబ్బందులు తాళలేక సులువుగా డబ్బు సంపాదించాలని దొంగతనాలను ఎంచుకున్నారు. అత్యంత రద్దీగా ఉండే లలితా జ్వువెలరీని తమకు అనువైన స్థానంగా ఎంచుకున్నారు. మొదటిసారి దొంగతనం చేయడంలో సఫలమయ్యారు. రెండోసారి తమ ప్రయత్నం ఫలించక తిరిగి వెళుతుండగా అదే ఆధారంతో పోలీసులకు పట్టుబడ్డారు. మంగళవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు.
క్రిష్ణాజిల్లా, నందిగామకు చెందిన షేక్ కరీముల్లా (27) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం నిమిత్తం నగరానికి వచ్చి సింధి కాలనీలోని బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన వాణి క్రాంతి మెడిసిన్‌లో పీజీ, డిప్లమా పూర్తిచేసింది. కొన్నిరోజులు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో పని చేసింది. సింధికాలనీలోని ఓ హాస్టల్ ఉంటోంది.
సోషల్ మీడియాలో పరిచయం..
సోషల్ మీడియా ద్వారా ఇద్దరికి పరిచయం ఏర్పడటంతో స్నేహితులుగా మారారు. ఇద్దరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో, సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల లలితా జ్వువెలరీ ప్రచారంలోకి రావడం, నిత్యం రద్దీగా ఉండడంతో దొంగతనానికి అనువుగా ఉంటుందని దానిని ఎంచుకున్నారు. గత నెల 11న ఇద్దరూ కలిసి షాపునకు వచ్చి మొదటి అంతస్తులో బంగారు గాజులు కొనేందుకు వచ్చినట్లు నటిస్తూ సేల్స్‌మెన్ దృష్టి మరల్చి నాలుగు గాజులు, ఒక బ్రాస్‌లెట్ కొట్టేశారు.
మరో మారు వచ్చి..
ఆ తర్వాత ఇద్దరు బురఖా ధరించిన యువతులు అదే షాపులో ఆరు లక్షల విలువచేసే 20 తులాల బంగారు ఆభరణం చోరీ చేసి దాని స్థానంలో రోల్డుగోల్డ్ ఆభరణం ఉంచారు. దీనిని గుర్తించిన షాపు నిర్వాహకులు అనుమానంతో ఆడిటింగ్ నిర్వహించగా, వాణి, కరీముల్లాల చోరీ వెలుగులోకి వచ్చింది. దీంతో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా వారు వెళ్లిన మార్గం కనిపెట్టలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత మల్లీ దొంగతనం చేసేందుకు అదే షాపునకు రాగా వారిని గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సొత్తును నందిగామలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి 1.32 లక్షలు రుణం తీసుకున్నట్లు అంగీకరించడంతో పోలీసుల బృందం నందిగామ వెళ్లి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
బురఖా దొంగలను పట్టుకుంటాం.
20 తులాల బంగారు ఆభరణం దొంగతనం చేసిన బురఖా దొంగలను అతిత్వరలో పట్టుకుంటామని, ఇప్పటికే సాంకేతిక ఆధారాలతో పురోగతి సాధించినట్లు డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment